Aus Vs Eng World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం అహ్మదాబాద్ నరేంద్రమోదీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో నెగ్గింది. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల టార్గెన్‌ను ఛేదించలేక ఇంగ్లాండ్.. 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (50), బెన్ స్టోక్స్ (64), మొయిన్ అలీ (42), చివర్లో క్రిస్‌వోక్స్ (32) రాణించారు. ఈ విజయంతో ఆసీస్ సెమీస్ అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అధికారికంగా సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, మిచెల్ స్టార్క్ 2, ప్యాట్ కమిన్స్ 2, హజెల్‌వుడ్ 2, స్టోయినిస్ 1 వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్ ఆడమ్ జంపాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
287 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. కానీ, మలన్, స్టోక్స్ పోరాటం వల్ల ఇంగ్లాండ్ శిబిరంలో ఆశుల చిగురించాయి. 35 ఓవర్లకు ఇంగ్లాండ్ 169-4తో పటిష్ఠ స్థితిలో కనిపించింది. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 90 బంతుల్లో 118 పరుగులు కావాలి. ఈ దశలో ఇంగ్లాండ్ గెలుస్తుందనిపించింది. కానీ, ఆసీస్ స్పిన్నర్ జంపా.. ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. అయినా చివర్లో వోక్స్, ఆదిల్ రషీద్ (20), డేవిడ్ విల్లే (14) కాసేపు పోరాడినా ఫలితం దక్కలేదు.