ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ చేసిన విన్యాసం వల్ల అందరి దృష్టి అతడిపై పడింది. ఆ సమయంలో క్యాచ్ పట్టి ఉంటే మాత్రం కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్యాచ్ మిస్ అయినప్పటికి అతడి విన్యాసం మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే సిక్సర్ వెళ్లాల్సిన బంతిని కేవలం ఒక్క పరుగుకే పరిమితం చేసి ఐదు పరుగులు సేవ్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో అప్పటికే సెంచరీతో అద్భుతంగా ఆడుతున్న డేవిడ్ మలాన్ కమిన్స్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. చాలా ఎత్తులో బంతి వెళ్లడంతో పక్కాగా సిక్స్ అని అనుకున్నాడు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న ఆస్టన్ అగర్ సూపర్‌మ్యాన్‌లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకున్నాడు.
అయితే అప్పటికే బౌండరీ లైన్ దాటేశాడు అగర్..దాంతో క్యాచ్ పట్టినా ఉపయోగముండదు. అందుకే బంతిని వెంటనే బౌండరీ లైన్ అవతలకు విసిరేసిన తర్వాతే కిందపడ్డాడు. అలా ఆరు పరుగులు రావాల్సింది పోయి ఇంగ్లాండ్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆస్టన్ అగర్ చేసిన విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుముందు లియామ్ డాసన్‌ను కూడా ఆస్టన్ అగర్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.