AUS vs ENG Ashes 2021:ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను 147 పరుగులకే ఆలౌట్ చేసింది. పేస్, బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్ పేసర్లు చెలరేగగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ (0) ను పెవిలియన్ పంపాడు స్టార్క్. తర్వాత మలన్ (6), రూట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు హేజిల్‌వుడ్. కాసేపటికే స్టోక్స్(5).. కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. ఆ తర్వాత మరో ఓపెనర్ హసీబ్ హమీద్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఒల్లీ పోప్. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరు క్రీజులో కుదురుకుంటున్న సమయంలో హమీద్‌ను (25)ను బోల్తా కొట్టించాడు కమిన్స్. ఆ తర్వాత పోప్(35), బట్లర్(39) కాసేపు పోరాడారు. వీరు కూడా ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో 147 పరుగులతో సరిపెట్టుకుంది ఇంగ్లాండ్.