Aus Vs Ban World Cup 2023 :2023 వరల్డ్‌కప్ లీగ్ దశను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. శనివారం పుణె వేదికగా బంగ్లాదేశ్‌ను ఢీకొన్న ఆసీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్..44.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (177* పరుగులు : 132 బంతుల్లో; 17x4, 9x6) సెంచరీతో అదరగొట్టగా.. డేవిడ్ వార్నర్ (54), స్టీవ్ స్మిత్ (63*) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. భారీ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు విజయాన్ని కట్టబెట్టిన మిచెల్ మార్ష్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక ఈ ఓటమితో బంగ్లాదేశ్.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమై టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10) మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. దీంతో బంగ్లా పైచేయి సాధిస్తుందనిపించింది. కానీ, మరో ఓపెనర్ వార్నర్, వన్ డౌన్లో వచ్చిన మిచెల్ మార్ష్.. రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 22.1 ఓవర్ వద్ద ముస్తాఫిజుర్.. వార్నర్‌ను వెనక్కిపంపాడు. అయినా మార్ష్ పోరాటం ఆగలేదు. అతడు స్మిత్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. వీరిద్దరూ బంగ్లా బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వకుండా పని పూర్తి చేశారు.