Kl rahul Athiya Shetty : వరల్డ్ కప్ ముందు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ మంగళవారం జరిగింది. భారత్ మొదట్లో తడబడినా.. ఆఖరి ఓవర్లలో విరుచుకుపడింది. ఆసీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరకు సొంత తప్పిదాలతో అనూహ్యంగా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కలిసి రాకున్నా.. ఒకరికి మాత్రం బాగా కలిసొచ్చింది. తన ప్రేయని మదినే కాదు.. ఆ ప్రదర్శన క్రికెట్ అభిమానుల మనస్సునూ గెలిచింది. ఇంతకీ ఆటగాడు ఎవరంటారా? అతడే.. టీమ్ ఇండియా ఓపెనర్.. కేఎల్ రాహుల్. అతడు ఈ మ్యాచ్‌లో చేసిన ప్రదర్శనకు తన ప్రేయసి ఫిదా అయింది. అంతటితో ఆగకుండా అతడ్ని లవ్ ఎమోజీతో అభినందించింది.
మొహాలి వేదికగా జరిగిన భారత్-ఆసీస్ మొదటి మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా దిగాడు కేఎల్ రాహుల్. 35 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించాడు. అందులో నాలుగు పోర్లు, మూడు అద్భుతమైన సిక్స్‌లు కొట్టాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీపై తన ప్రేయసి అతియా శెట్టి స్పందించింది. రాహుల్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ పైకెత్తిన ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుంది. దానికి ఒక లవ్ ఎమోజీని జత చేసి తన ప్రేమను తెలియజేసింది. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె. అయితే చాలా కాలంగా అతియా.. రాహుల్‌తో డేటింగ్లో ఉంది. అతడితో పాటు అతియా పలు మార్లు క్రికెట్ టూర్లలో కూడా సందడి చేసింది.