Asian Games Cricket Gold Medalist :2023 ఆసియా క్రీడల్లో భారత మహిళలు క్రికెట్ విభాగంలో చరిత్ర సృ ష్టించారు. సోమవారం శ్రీలంతో జరిగిన ఫైనల్స్లో 19 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి.. పసిడిని ముద్దాడారు. దీంతో క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ విజయంతో మహిళల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా.. టీమ్ఇండియా మహిళా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధాన (46 పరుగులు, 4x6, 1x6), జెమీమా రోడ్రిగ్స్ (42 పరుగులు, 5x4) రాణించారు. ఇక గత మ్యాచ్ సంచలనం షఫాలీ వర్మ (9), వికెట్ కీపర్ రిచా గోష్ (9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (2), పూజ వస్ర్తకార్ (2) నిరాశ పర్చారు. ఇక శ్రీలంక బౌలర్లలో ఇనోకా, సుగంధిక, ప్రభోదని తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.
అనంతరం 117 పరుగుల లక్ష్య ఛేనలో దిగిన లంక 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమ్ఇండియా 18 ఏళ్ల యంగ్ బౌలర్ టిటాస్ సాధు.. వరుసగా అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నే (0), కెప్టెన్ చమరి ఆటపట్టు (12)ను పెవిలియన్ చేర్చి లంకను దెబ్బకొట్టింది. తర్వాత హాసిని పెరీరా (25 పరుగులు, 4x4, 1x6), నీలాక్షి డి సిల్వా (23 పరుగులు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే సరైన సమయానికి రాజేశ్వరి గైక్వాడ్ భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె హాసిని పెరీరాను ఔట్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఓషది రణసింగ్ (19) కాసేపు పోరాడినా.. ఓటమి అంతరాయాన్ని తగ్గించారే తప్ప జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, దేవిక వైద్య తలో వికెట్ పడగొట్టారు.