Asian Games 2023 Indonesia Vs Mongolia :అంతర్జాతీయ క్రికెట్లో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది మంగోలియా మహిళల క్రికెట్ జట్టు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగళవారం(సెప్టెంబర్ 19న) ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 పరుగులకే మంగోలియన్ జట్టు కుప్పకూలింది. చైనాలోని హాంగ్‌జౌలో ప్రారంభమైన ఆసియా క్రీడల్లో ఈ పరిణామం జరిగింది. కాగా, టీ20 ఇంటర్నెషనల్ క్రికెట్లో ఇదే రెండో అత్యల్ప స్కోర్. అయితే 20 ఓవర్ల మ్యాచ్‌లో 20 పరుగులు కూడా మంగోలియా ప్లేయర్స్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌తో ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలిచి ఆసియా గేమ్స్‌లో బోణీ కొట్టింది.
ఓపెనర్లు శుభారంభం!
ఇక ఇరు జట్ల మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండోనేసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి మంగోలియా ముందుంచుంది. ఓపెనర్ రత్న దేవీ 10 ఫోర్ల సాయంతో 48 బంతుల్లో 62 చేసి అర్ధసెంచరీతో మెరవగా.. మరో ఓపెనర్ నందా సకరిని(35), మరియా వొంబాకీ(22) ఫర్వాలేదనిపించే స్కోర్లతో రాణించారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్లు తలో వికెట్ తీశారు. మంగోలియా బౌలర్లు ఏకంగా 48 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో 38 వైడ్లు ఉన్నాయి.