Asian Games 2023 :హంగ్జౌ వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతోంది. చరిత్రలో తొలిసారిగా భారత్ మూడంకెల పతకాలను సాధించే దిశగా వెళుతోంది. ఈసారి వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. గత ఆసియా గేమ్స్‌లో (2018) భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించగా.. ఈసారి క్రీడల్లో ఇప్పటికే ఆ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం 90కి పైగా పతకాలతో భారత్.. నాలుగో స్థానంలో ఉంది. మరికొన్ని పోటీల్లో పతకాలు ఇప్పటికే ఖాయం కాగా.. కీలక రెజ్లర్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
శుక్రవారం గెలిచిన పతకాలు
- శుక్రవారం పురుషుల విభాగం కబడ్డీలో.. సెమీస్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్‌కు పతకం ఖయమైంది. ఇక భారత కబడ్డీ జట్టు గోల్డ్ మెడల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది.
- భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ రజత పతకాన్ని గెలుచుకుంది. మహిళ 62 కిలోల విభాగంలో చైనాకు చెందిన జియా లాంగ్‌పై విజయం సాధించింది.
- రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత బృందం ఫైనల్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో రజత పతకం దక్కించుకోగలిగింది.
- బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్ సెమీస్‌లో ఓడిపోయాడు. అయితే కాంస్య పతకం దక్కింది.
- భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు వియత్నాంపై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
- సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళా జట్టు కాంస్యం గెలుచుకుంది.
- మరో భారత రెజ్లర్ కిరణ్ బిష్ణోయ్ కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల 76 కిలోల విభాగంలో మంగోలియాకు చెందిన అరియుంజర్గల్ గణబత్పై 6-3 తేడాతో గెలుపొందింది.
- బ్రిడ్జ్ విభాగంలో భారత పురుషుల జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో హాంకాంగ్‌తో ఓడిపోవడం వల్ల రజతంతో సరిపెట్టుకుంది.
- రెజ్లర్ అమన్ సేహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 57 కిలోల పురుషుల విభాగంలో చైనాకు చెందిన మింగూ లియీపై విజయం సాధించాడు.
- భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హాకీ ఫైనల్‌లో 5-1 తేడాతో జపాన్‌పై నెగ్గిన భారత్.. స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఇక్కడ పతకాలు ఖాయం..
- క్రికెట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరడం వల్ల పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇందులో గెలిస్తే స్వర్ణం ఓడితే రజతం ఖాతాలోకి చేరనుంది. టీమ్‌ఇండియా ఫామ్‌ను బట్టి గోల్డ్ రావడం ఖాయం.
- కబడ్డీ పురుషుల విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మహిళా జట్టు కూడా సెమీస్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఓడినా ప్లే ఆఫ్‌లు లేకపోతే కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది.
- కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవిణ్ ఫైనల్‌కు చేరారు. శనివారం ఈవెంట్ జరగనుంది. దీంతో గోల్డ్ లేదా సిల్వర్ పతకాలు భారత్‌ను వరించనున్నాయి.
- మహిళల ఆర్చరీ విభాగంలోనూ జ్యోతి సురేఖ ఫైనల్‌కు వెళ్లింది. ఈ విభాగంలో పతకం వచ్చేయనుంది. ఇది కూడా శనివారమే జరగనుంది.
- బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ సెమీస్‌లో మలేషియా జోడీతో సెమీస్‌లో తలపడనుంది. ఇందులో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఇందులో ఓడినా కాంస్య పతకం ఖాయంగా వస్తుంది.
- హాకీలోనూ భారత పురుషుల జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్‌కు చేరిన భారత్ స్వర్ణం కోసం జపాన్‌తో తలపడనుంది.