Asian Games 2023 Cricket Gold Medal : ఆసియా క్రీడల్లో క్రికెట్ విభాగంలో టీమ్ ఇండియా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. స్వర్ణం కోసం భారత్ - అఫ్గాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో టాప్‌సీడ్ కావడం వల్ల టీమ్‌ఇండియాకు స్వర్ణం దక్కింది. అఫ్గాన్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
మ్యాచ్ ఎలా సాగిందంటే?..టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల దెబ్బకు అప్ఘాన్ టాప్ ఆర్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులు, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వర్షం రాకతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం అంతరాయం కారణంగా అప్ఘాన్ ఇన్నింగ్స్ 18.2 ఓవర్ల సమయంలో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికీ అప్ఘానిస్థాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉంది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి కనపడలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అనౌన్స్ చేశారు.
టీమ్‌ఇండియాకు స్వర్ణం ఎలా అంటే?..ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉండటం వల్ల టీమ్ ఇండియాకు స్వర్ణం వరించింది. కాగా, భారత మహిళా క్రికెట్ జట్టు కూడా గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా విజయంతో భారత్ పసిడి పతకాల సంఖ్య 28కు చేరింది. 38 రజత, 41 కాంస్య పతకాలు రావడం వల్ల మొత్తంగా 107 పతకాలతో టేబుల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.