ఆసియా కప్ పుణ్యమా అంటూ మరోసారి టీమ్ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించే అవకాశం క్రికెట్ ప్రియులకు దక్కింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌పై విజయం సాధించిన భారత్.. సూపర్-4 దశకు చేరుకుంది. ఈ క్రమంలో మళ్లీ ఆదివారం జరిగే మ్యాచ్‌లోనూ ఈ ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత మొదటిసారి ఆసియా కప్‌లోనే ఇరు జట్లూ తలపడ్డాయి. అయితే ఈసారి మాత్రం ఉత్కంఠపోరులో పాక్‌ను భారత్ చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. మరోసారి ఇదే ఫలితం రావాలని టీమ్ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోపాటు భువనేశ్వర్ బౌలింగ్ దాడి.. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించడం భారత్‌కు కలిసొచ్చింది. కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు పరుగులు చేశారు. హార్దిక్ (17 బంతుల్లో 33 నాటౌట్) మాత్రమే దూకుడుగా ఆడాడు. రోహిత్, కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈసారి మాత్రం అలాంటి అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకూడదు. ఆ జట్టులో షహీన్‌షా అఫ్రిది లేకపోయినా.. నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ వంటి పదునైన బౌలింగ్ దళం పాక్‌కు ఉంది.
ఆ లోటును పూరించాలి.. రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం లేకపోలేదు. లెఫ్ట్‌ఆర్మ్ బౌలింగ్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్ సొంతం. భువనేశ్వర్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా బౌలింగ్ దళం రెండు మ్యాచుల్లోనూ మెరుగ్గానే రాణించింది. అయితే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో మాత్రం యువ బౌలర్లు అవేశ్ ఖాన్ (1/53), అర్ష్‌దీప్ సింగ్ (1/44) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పాక్‌తో ఇలాంటి ప్రదర్శన చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బాబర్ అజామ్, రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్ వంటి టాప్‌ఆర్డర్ బ్యాటర్లు ఈసారి రెచ్చిపోవడం ఖాయం. సరైన ప్రాంతంలో బంతులను సంధిస్తేనే ఫలితం టీమ్‌ఇండియాకు అనుకూలంగా వస్తుంది.
ఈ సారి ఎలా ఆడతారో.. తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ మాత్రం శుభారంభం ఇవ్వలేదు. మిగతా బ్యాటర్లు రాణించడంతో స్కోరు బోర్డు సజావుగా సాగింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనైనా వీరిద్దరూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ కూడా పరుగులను ఎక్కువగా వృథా చేయకుండా సూర్యకుమార్ మాదిరిగా ధాటిగా ఆడాలి. భారత టాప్ ఆర్డర్ ఫామ్ అందుకొని భారీగా పరుగులు చేస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. ఒకరిద్దరు మినహా ఆ జట్టుకు బౌలింగ్ దాడి భీకరంగా ఏమీ లేదు. ఇక టీమ్‌ఇండియా తుది జట్టులో స్థానం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రిషభ్ పంత్/దినేశ్ కార్తిక్.. ఇద్దరూ ఉంటారా..? లేకపోతే ఒకరికే చోటు ఇస్తారనేది పిచ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.