Asia Games 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆసియా క్రీడలు త్వరలో జరగనున్నాయి. చైనా వేదికగా జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు.. ఆసియా క్రీడలకు ఆడనున్న తమ జట్లను ప్రకటించగా.. పాకిస్థాన్ బోర్డు కూడా తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. తమ జట్టుకు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఖాసిం అక్రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఖాసిం అక్రమ్‌తో పాటు మీర్జా తాహిర్ బేగ్, అరాఫత్ మిన్హాస్, రోహైల్ నజీర్, సుఫియాన్ ముఖీమ్, ముహమ్మద్ అఖ్లాక్‌ల ఓమైర్ బిన్ యూసుఫ్, తొలిసారి పాకిస్థాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా.. అయితే అందరి దృష్టి మాత్రం ఈ యంగ్ ప్లేయర్ ఖాసిం అక్రమ్‌పై పడింది. ఇంతకీ అతను ఎవరంటే?
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరఫున అక్రమ్ ఆడుతున్న ఈ 20 ఏళ్ల అక్రమ్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచుల్లో 27 వికెట్లతో పాటు 960 పరుగులను అక్రమ్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. మరోవైపు లిస్ట్-ఏ క్రికెట్‌లో 45 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అక్రమ్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి.