Asia Emerging Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ సెమీస్‌లో భారత్ ఏ.. బంగ్లాదేశ్ ఏను చిత్తుచేసింది. ఆశల్లేని స్థితిలో అద్భుతంగా పుంజుకొని 51 పరుగుల తేడాలో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తుది పోరులో పాకిస్థాన్‌తో మరోసారి భారత్ ఏ తలపడనుంది. తన ఒంటరి పోరాటంతో భారత్‌కు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు అందించిన కెప్టెన్ యశ్ ధుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
70/0 నుంచి 160 ఆలౌట్...
బంగ్లాదేశ్ - ఏ జట్టు కష్టతరం కాని 212 పరుగుల లక్ష్య ఛేదనను ఘనంగానే ఆరంభించింది. పవర్ ప్లేలో బంగ్లా ఓపెనర్లు ఎదురుదాడికి దిగి రన్‌రేట్ ఆరుకు తగ్గకుండా ఆడారు. పది ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు స్కోరు.. 60/0. ఇక భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అప్పుడే టీమ్ఇండియా ఆట మొదలైంది. బౌలర్ మానవ్ సుతార్ బంగ్లా ఓపెనర్ నయీమ్‌ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత నిషాంత్ సింధు.. మరో ఓపెనర్ హసన్‌ను వెనక్కిపంపాడు.
ఆ తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఆటపై పట్టు సాధించారు. బంగ్లా స్కోరు 100కు చేరేసరికి మూడు వికెట్లు నష్టపోయింది. ఇక చివర్లో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను పేక మేడలా కూల్చారు. చివరి 30 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ చివరి 5 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో నిషాంత్ సింధు 5 వికెట్లతో మెరిశాడు. మనవ్ సుతార్ మూడు వికెట్లు, ధొడియా, అభిషేక్ తలో వికెట్ పడగొట్టారు.