తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖర్లో 2 బంతులకు 2 సిక్సర్లు.. అఫ్గాన్​పై పాక్​ గెలుపు.. టీమ్​ ఇండియా ఇంటికి..

Asia Cup 2022 Pak vs Afg : ఆసియా కప్​లో భారత్​ ఫైనల్​ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అఫ్గాన్​పై ఉత్కంఠ పోరులో గెలిచిన పాక్​.. ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది.

Asia Cup Pak vs Afg Match Result
Asia Cup Pak vs Afg Match Result

By

Published : Sep 7, 2022, 11:05 PM IST

Asia Cup 2022 Pak vs Afg : భారత్​ ఆశలు ఆవిరయ్యాయి. అఫ్గానిస్థాన్​పై సూపర్​-4 మ్యాచ్​లో గెలిచిన పాక్​.. ఆసియా కప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శ్రీలంక, పాకిస్థాన్​ టైటిల్​ కోసం పోటీపడనున్నాయి. దీంతో ఆసియా కప్​లో ఘనచరిత్ర ఉన్న టీమ్​ ఇండియా ఈసారి ఫైనల్​ చేరకుండానే ఇంటిముఖం పట్టింది.

తొలుత టాస్​ గెలిచిన పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. అఫ్గాన్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. అఫ్గానిస్థాన్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్​ ధాటిగానే ప్రారంభించిన ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్​, రహ్మనుల్లా గుర్బాజ్.​. 3.5 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. గుర్బాజ్​ 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి రవూఫ్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. కాసేపటికే జజాయ్​ కూడా (17 బంతుల్లో 21) అవుటయ్యాడు. అఫ్గాన్​ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్​ (37 బంతుల్లో 35) టాప్​ స్కోరర్​.
పాక్​ బౌలర్లలో హారిస్​ రవూఫ్​ 2 వికెట్లు తీశాడు. నసీం షా, హస్నైన్​, నవాజ్​, షాదాబ్​ ఖాన్​ తలో వికెట్​ పడగొట్టారు.

130 పరుగుల లక్ష్యంతో బరిలోకి పాక్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. స్కోరు 1 వద్దే బాబర్​ డకౌట్​ అయ్యాడు. 18కే 2 వికెట్లు కోల్పోయింది. రిజ్వాన్​(20), ఫఖార్​ జమాన్​(5) రన్స్​ చేశారు. నాలుగో వికెట్​కు ఇఫ్తిఖార్​ అహ్మద్​, షాదాబ్ ​ఖాన్​ 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్​ను గాడినపెట్టారు. షాదాబ్​ ఖాన్​ ఫోర్​, 3 సిక్సర్లతో 26 బంతుల్లోనే 36 పరుగులు చేసి పాక్​ను లక్ష్యం దిశగా తీసుకెళ్లి.. వేగంగా ఆడే క్రమంలో 17వ ఓవర్లో పెవిలియన్​ చేరాడు.
ఆ తర్వాత అఫ్గాన్​ పుంజుకుంది. 18వ ఓవర్​ వేసిన ఫరూకీ 4 పరుగులు మాత్రమే ఇచ్చి మహ్మద్​ నవాజ్​, ఖుష్దిల్​ షాను పెవిలియన్​ చేర్చాడు. 19వ ఓవర్లోనూ అహ్మద్​ మాలిక్​ రెండు వికెట్లు తీశాడు.

అఫ్గాన్​ బౌలర్లలో రషీద్​ ఖాన్​ 2 వికెట్లు తీయగా.. ఫరూకీ, మాలిక్​ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫరూకీ ఆఖరి ఓవర్​ వేయగా తొలి రెండు బంతుల్నే సిక్సర్లుగా మలిచి నసీం షా పాక్​ను గెలిపించాడు. హీరో అయ్యాడు. దీంతో లంక, పాక్​ ఫైనల్లో తలపడనున్నాయి. ఇండియా, అఫ్గానిస్థాన్​ ఇంటిదారి పట్టాయి.

ABOUT THE AUTHOR

...view details