తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ పాక్​ మ్యాచ్, అందరి దృష్టి పరుగుల వీరుడు కోహ్లీ పైనే

చరిత్రను అనుసరించేవారు కొందరు. చరిత్ర సృష్టించేవారు ఇంకొందరు. రెండో జాబితాకు చెందిన అరుదైన ఆటగాడే విరాట్‌ కోహ్లీ. సచిన్‌ను మించి పరుగుల వరద పారించే, రికార్డులు నెలకొల్పే ఆటగాడు ఇంకొకడు రాడనుకుంటే అతనొచ్చాడు. ఛేదనల్లో ఒత్తిడికి ఎవ్వరైనా చిత్తయిపోవాల్సిందే అన్న అభిప్రాయాన్ని మార్చి, అసాధారణ గణాంకాలు నమోదు చేశాడు. కెప్టెన్సీని చాలామంది భారంగా భావిస్తే దాన్ని ప్రేరణగా మార్చుకుని మరింత చెలరేగి ఆడాడు. టన్నుల కొద్దీ పరుగులు, మంచినీళ్ల ప్రాయంగా శతకాలు, రికార్డుల మీద రికార్డులు.. ఇలా అప్రతిహతంగా సాగిన అతడి ప్రయాణం కొంత కాలంగా ఒడుదొడుకులకు గురవుతోంది. పరుగుల లేమితో సతమతం అవుతున్న విరాట్‌.. శతకం కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నాడు. ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక పోరు ముంగిట తన నుంచి తనే స్ఫూర్తి పొందితే పాత కోహ్లీని చూడడం కష్టమేమీ కాబోదు.

virat kohli
virat kohli

By

Published : Aug 28, 2022, 7:22 AM IST

Asia Cup Virat Kohli: ఈ మధ్య జాంటీ రోడ్స్‌ హైదరాబాద్‌లో ఒక శిక్షణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. ఆ సందర్భంగా విలేకరులు ఫామ్‌లో లేని కోహ్లీకి మీరేమైనా సలహాలిస్తారా అని అడిగితే.. "నేను విరాట్‌కు సలహాలివ్వడమేంటి? బ్యాటింగ్‌ గురించి నాకంటే అతడికే తెలుసు. కావాలంటే మా ఇద్దరి రికార్డులు చూసుకోండి" అన్నాడు. విరాట్‌ స్థాయి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. నిజమే.. విరాట్‌కు ఎలా ఆడాలో, అతనేం సర్దుబాట్లు చేసుకోవాలో, ఫామ్‌ అందుకోవడానికి ఏం చేయాలో ఎవ్వరూ సలహాలివ్వాల్సిన పని లేదు.

లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో, వైఫల్యాల్ని ఎలా అధిగమించాలో విరాట్‌ కంటే బాగా ఎవరికీ తెలియదు. 5 టెస్టుల్లో 13.4 సగటుతో 134 పరుగులు.. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లీ గణాంకాలివి. ఇంకో నాలుగేళ్లకు అదే దేశంలో పర్యటించినపుడు అతను 5 టెస్టుల్లో 2 శతకాలు, 5 అర్ధశతకాలు సహా 59.3 సగటుతో 593 పరుగులు చేసి సిరీస్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ సైతం అతడికి దరిదాపుల్లో లేరు. 2014లో ఆఫ్‌ స్టంప్‌ మీద పదే పదే బంతులేసి తనను ఏడిపించిన అండర్సన్‌ బృందాన్ని నాలుగేళ్ల తర్వాత గొప్పగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన చరిత్ర అతడిది. పడ్డ చోటే లేవడం, తనను ఇబ్బంది పెట్టిన బౌలర్లకు దీటైన సమాధానం చెప్పడం కోహ్లీకి కొత్తేమీ కాదు.

అందులోనూ అతణ్ని కవ్విస్తే అంతే సంగతులు. జమైకాలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బౌలర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ తనను ఔట్‌ చేసి పుస్తకంలో టిక్‌ కొడుతున్నట్లు సంజ్ఞ చేశాడని, దాన్ని గుర్తు పెట్టుకుని తర్వాత 2019లో హైదరాబాద్‌లో కరీబియన్‌ జట్టుతో టీ20లో అతడి బంతిని స్టాండ్స్‌లోకి పంపి కోహ్లి అతణ్ని అనుకరించిన తీరును అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ రోజు అతడి కసి ముందు 208 పరుగుల భారీ లక్ష్యం చిన్నదైపోయింది. అప్పుడతను 50 బంతుల్లోనే 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక 2012లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌ చేరాలంటే శ్రీలంకపై 320 పరుగుల లక్ష్యాన్ని 40 ఓవర్లలోనే ఛేదించాల్సిన పరిస్థితి తలెత్తితే.. ఇది అసాధ్యం అని అంతా అనుకుంటుండగా.. 86 బంతుల్లోనే 133 పరుగులతో అజేయంగా నిలిచి 36.4 ఓవర్లలోనే ఛేదన పూర్తయ్యేలా చేసిన కోహ్లీ విశ్వరూపం అభిమానుల మనసుల్లో చెరిగిపోనిది.

అప్పటికి ప్రపంచ మేటి పేసర్లలో ఒకడైన మలింగ విరాట్‌ ధాటికి 7.4 ఓవర్లలోనే 86 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌ అయిన కొన్ని రోజులకే ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థిపై 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 183 పరుగులతో అజేయంగా నిలవడం విరాట్‌కే చెల్లింది. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్‌ వీరోచిత విన్యాసాలు కోకొల్లలు. ఆ కసి, దూకుడు, నిలకడ, నైపుణ్యం, పోరాట పటిమ కలగలిసిన ఆటగాడు క్రికెట్‌ చరిత్రలోనే అరుదు. దూకుడుగా ఆడాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎలా చెలరేగిపోయేవాడో.. ఓపిగ్గా క్రీజులో నిలవాల్సిన టెస్టు క్రికెట్లో అంతే నిబ్బరం చూపించి ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిచిన ఘనుడు విరాట్‌.

కోహ్లీ అంటే గుర్తుకొచ్చేది అతడి కసి. మామూలుగానే ఏ భారత క్రికెటర్‌కైనా పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే ఎక్కడ లేని కసి వస్తుంది. ఇక కోహ్లి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇదే ఆసియా కప్‌లో, ఇదే పాకిస్థాన్‌పై అతనెలా చెలరేగిపోయాడో అభిమానులకు గుర్తే. అప్పటి ఆ మెరుపులను గుర్తు తెచ్చుకుంటే కోహ్లీకి ఇంకే స్ఫూర్తీ అక్కర్లేదు. మరి అతడిలోని పరుగు వీరుడు ఆదివారం నిద్ర లేస్తాడా? ఒకప్పటి కోహ్లీని సాక్షాత్కరింపజేస్తాడా?

ఇవీ చదవండి:ఏకపక్షంగా ఆసియా కప్ తొలి మ్యాచ్, అఫ్గాన్​పై చిత్తుగా ఓడిన శ్రీలంక

ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, మానసిక పరిస్థితులపై రోహిత్ శర్మ

ABOUT THE AUTHOR

...view details