Anushka Sharma instagram post : ఆసియాకప్‌లో టీమ్ఇండియా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌పై వీరవిహారం చేసిన కోహ్లీ 53 బంతుల్లోనే 100 మార్కును అందుకున్నాడు. మొత్తంగా 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ అనంతరం అతడి చిరునవ్వుకు ఫిదా కాని భారత అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.
ఇక ప్రేక్షకులకు అభివాదం చేసిన అనంతరం కోహ్లీ తన మెడలో ధరించిన చైన్‌ను, అలాగే తన వివాహ ఉంగరాన్ని ముద్దాడాడు. ఆ సమయంలో భావోద్వేగపూరితంగా కనిపించాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం.. సంజయ్ మంజ్రేకర్ కోహ్లీని పలు ప్రశ్నలు అడగ్గా అతడు చెప్పిన సమాధానాలు వింటే అతను ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడో తెలుస్తోంది.
"గత రెండున్నరేళ్లలో ఎన్నెన్నో అనుభవాలు నాకు ఎన్నో నేర్పించాయి. మరో నెలలో నాకు 34 ఏళ్లు నిండుతాయి. ఎప్పుడూ ఆవేశంగా సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకునే నేను ఇప్పుడూ అలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాను. సెంచరీ అనంతరం కాసేపు నేనూ షాకయ్యాను..ఈ ఇన్నింగ్స్ పలు విషయాల సమాహారం. ఇందులో మా జట్టు నాకు అండగా ఉంది." అని కోహ్లీ చెప్పాడు.