Asia Cup Controversies : ఆసియా కప్ మొదలై మూడు రోజులే అయింది. కానీ క్రికెట్ లవర్స్‌కు ఈ టోర్నీ ఇచ్చే కిక్కు మాత్రం మామూలుగా ఉండదు. ఆడేది ఆరు దేశాలే.. కానీ వీక్షకులకు మాత్రం వినోదం ఫుల్. అయితే ఈ ఆసియా కప్ వినోదంతో పాటు వివాదాలకూ లోటులేని టోర్నీగా చరిత్రకెక్కింది. ఇక భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పటిష్ఠమైన జట్లు ఉంటే ఆ మాత్రం హడావుడి ఉండాల్సిందే. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌ల్లోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మరి ఇలాంటి 'మినీ టోర్నీ'లో ఇప్పటి వరకు జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల గురించి తెలుసుకుందాం..
గంభీర్ - కమ్రాన్ అక్మల్..
Gautam Gambhir Kamran Akmal : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అటు ఆడియెన్స్‌తో పాటు మైదానంలో దిగే ఆటగాళ్లలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. మ్యాచ్‌లు కాస్త రసవత్తరంగా మారే కొద్దీ ప్లేయర్స్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం కుడా కామనే. అయితే కొన్ని సార్లు అవి పెద్దదై కాంట్రవర్సీలుగా మారుతుంటాయి. సరిగ్గా అలాంటిదే 2010 ఆసియా కప్ సందర్భంగా జరిగింది.
పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు గంభీర్ ఔట్ కోసం అప్పీలు చేశారు. అయితే, అంపైర్ బిల్లీ బౌడెన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో పాకిస్థాన్ రివ్యూకి వెళ్లింది. ఈ సమయంలోనే గంభీర్, వికెట్ కీపర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే అది కాస్త కాసేపటికే తీవ్రం కావడం వల్ల ఇరు జట్ల ప్లేయర్స్ వారిని అడ్డుకొన్నారు. గంభీర్‌ను ధోనీ పక్కకు తీసుకెళ్లగా.. కమ్రాన్ అక్మల్‌ను పాక్ ఆటగాళ్లు సముదాయించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది.
హర్భజన్ -అక్తర్..
Harbhajan Singh Shoaib Akhtar :ఆసియా కప్ 2010 టోర్నీలో జరిగిన గంభీర్ - కమ్రాన్ అక్మల్ వాగ్వాదం మరువకముందే.. ఇదే మ్యాచ్‌లో కాసేపటికే హర్భజన్ సింగ్ - షోయబ్ అక్తర్ గొడవపడ్డారు. దీనికి కారణం అక్తర్ బౌలింగ్‌లో హర్భజన్ భారీ సిక్సర్ కొట్టడం. ఆ తర్వాత అక్తర్ బౌన్సర్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇక చివరిగా హర్భజన్ సింగ్ మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో సిక్స్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో అక్తర్ వైపు కాస్త కోపంగా చూశాడు.
ఇటీవల ఆ సంఘటనపై అక్తర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. "మ్యాచ్ అయిపోయాక హర్భజన్ సింగ్ ఉన్న రూమ్‌ను వెతుక్కుంటూ వెళ్లాను. అతడితో పోట్లాడదామనే అక్కడి వరకు వెళ్లాను. మాతో కలిసి తిన్నాడు. లాహోర్‌లో మాతోనే కలిసి తిరిగాడు. ఇలాంటి వ్యక్తి మనతో తప్పుగా ప్రవర్తిస్తాడా? అని ఒక్క క్షణం ఆలోచించాను. ఇక మరుసటి రోజు నేను శాంతించాను. అతడు కూడా సారీ చెప్పాడు" అని అక్తర్ తెలిపాడు.
ఆ ఇద్దరి జోరు.. పాక్ - అఫ్గానిస్థాన్ పోరు..
Pakistan Vs Afganistan Asia Cup : భారత్ - పాకిస్థాన్ టీమ్స్ మధ్య ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. పాక్ - అఫ్గానిస్థాన్ మధ్య కూడా అదే రేంజ్లో ఉద్విగ్న పరిస్థితులు ఉంటాయి. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ సందర్భంగా జరిగిన వాగ్వాదాన్ని ఏ క్రికెట్ లవర్ కూడా మర్చిపోలేరు.