ఆసియా కప్ 2023 టోర్నమెంట్ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఘాటు మాటల యుద్ధం నడుస్తోంది. ప్రపంచ క్రికెట్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా.. పాకిస్థాన్‌లో ఆడే బదులు వేరే దేశాల్లో ఆడేలా పీసీబీ ప్రతిపాదించింది. ఈ హైబ్రిడ్ మోడల్‌ను మొదట బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆ తర్వాత తిరస్కరించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక, యూఏఈ ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ పాకిస్థానం మాత్రం.. తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్ నిర్వహించాలని పట్టుదలతో ఉంది. ఇప్పుడీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని పాక్ పేర్కొన్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా 2023 వన్డే కప్.. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగా ఆసియా కప్ రద్దైతే.. ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని పీసీబీ ఆలోచనలో పడింది.