Asia Cup 2023 Team India Squad : ఆసియా కప్ 2023కి రంగం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నీకి టీమ్‌ను ప్రకటించేందుకు టీమ్‌ఇండియా సెలక్షన్ కమిటీ రెడీ అయింది. దీనికోసం అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ సోమవారం(ఆగస్ట్ 21) దిల్లీలో భేటీ కాబోతోంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. దీంతో ఏఏ ప్లేయర్స్‌ను టీమ్‌లోకి తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెెలకొంది. అలాగే రోహిత్ శర్మ కెప్టన్‌గా(asia cup 2023 team india captain) ఉండే టీమ్‌కు వైస్ కెప్టెన్ ఎవరనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.
వైస్ కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించకపోవచ్చని అంటున్నారు. మరో ప్లేయర్‌ను సెలెక్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. రీసెంట్గా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి .. మొదటి ఓవర్‌లోనే బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. పునరాగమనాన్ని ఘనంగా చేసిన ఈ స్టార్ పేసర్కే వైస్ కెప్టెన్ బాధ్యతలకు బలమైన పోటీదారుడు అని పలువురు క్రికెట్ నిపుణులు అభిమానులు అంటున్నారు.
"సీనియారిటీ పరంగా చూస్తే.. పాండ్యా కన్నా బుమ్రానే ముందున్నాడు. 2022లో ఉన్నప్పుడు టెస్టు టీమ్‌కు సారథ్య బాధ్యతలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. పాండ్యకు ముందు సౌతాఫిక్రా టూర్లోనూ వన్డేల్లో వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఈ కారణంగానే ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్‌నకు బుమ్రాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చే అవకాశముంది. కాబట్టి రోహిత్ శర్మకు.. బుమ్రా డిప్యూటీగా సెలెక్ట్ అయితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఐర్లాండ్ టూర్లో రుతురాజ్‌కు బదులు అతడినే సారథిగా నియమించడానికి కారణం ఉంది" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇకపోతే హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో రీసెంట్గా ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. దీంతో అతడు జట్టును నడిపించిన తీరుపై బాగానే విమర్శలు వినిపించాయి.