Asia Cup 2023 Super 4 IND VS PAK : ఆసియా కప్ 2023 గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు టీమ్ఇండియా-పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన సమయానికి జోరు వర్షం కురిసింది. ఆ తర్వాత చాలాసేపు వేచి చూసినప్పటిక వర్షం తగ్గకపోవడం వల్ల చివరికి చేసేదేమి లేక పాక్ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. అందరూ డీలా పడిపోయారు.
అయితే సూపర్-4లో ఈ రెండు జట్లు మరో సారి పోటీపడనుండటం వల్ల మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. కానీ సూపర్-4 మ్యాచ్‌లు జరగనున్న వేదిక కొలంబోలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అభిమానులు మ్యాచ్ కోసం ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో అంతే ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు ఇప్పుడు క్రికెట్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని చెప్పి ఖుషి చేశారు.
Asia Cup 2023 Rain Update : టోర్నీ ముగింపు దశ మ్యాచ్‌లకు అంతగా వర్షం ముప్పు ఉండదని శ్రీలంక వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కరుణానాయక్ తెలిపారు. సెప్టెంబరు 9 తర్వాత కొలంబోలో వాతావరణం పొడిగా ఉంటుందని అన్నారు. ఒక వేళ వర్షం పడినా.. కేవలం చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో సెప్టెంబరు 10న టీమ్ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సజావుగా సాగే ఛాన్స్ ఉంది.