Asiacup 2023 IND VS Nepal : ఆసియా కప్ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) జరిగిన మ్యాచ్‌లో పసికూన నేపాల్ ను ఓడించి టీమ్‌ఇండియా సూపర్-4కు దూసుకెళ్లింది. వర్షం కారణంగా 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించిన మ్యాచ్‌లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన నేపాల్.. టీమ్‌ఇండియా ముందు 231 పరుగుల స్కోరును ఉంచింది. లక్ష్యఛేదనలో 2.1 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో వర్షం తగ్గిన తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్దేశించారు. రోహిత్ శర్మ (74*), శుభ్‌మన్ గిల్ (67*) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడం వల్ల.. టీమ్‌ఇండియా లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఈ ఓటమితో నేపాల్ ఇంటి బాట పట్టింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ మంచి పోరాటపటిమ కనబరిచింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఊహించిన దాని కన్నా మంచి స్కోరే సాధించింది. 48.2 ఓవర్లలో ఆలౌట్ అయి 230 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్(38; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆసిఫ్(58; 97 బంతుల్లో 8 ఫోర్లు) రాణించగా.. చివర్లో వచ్చిన సోంపల్ కామి(48; 56 బంతుల్లో) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. గుల్షాన్ జా(23), దిపేంద్ర సింగ్(29) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన దశలో.. నేపాల్ 180లోపే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివర్లో వచ్చిన సోమ్‌పాల్ పట్టుదలగా ఆడి స్కోర్ బోర్డు పెరిగేలా తనవంతు ప్రయత్నించాడు. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. వారి స్థాయికి తగ్గట్టు చేయలేదనే చెప్పాలి. అందుకే నేపాల్ ఈ స్కోరు చేయగలిగింది. సిరాజ్, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షమి, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నారు.
Asiacup 2023 IND VS PAK : భారత్ vs పాక్ మ్యాచ్ మళ్లీ.. గ్రూప్ ఏ నుంచి పాకిస్థాన్, టీమ్ ఇండియా సూపర్-4 దశకు అర్హత సాధించడం వల్ల.. ఈ ఇరు జట్లు మరోసారి పోటీపడనున్నాయి. సెప్టెంబరు 10న ఈ రెండు జట్ల మధ్య పోరు ఉండనుంది. గ్రూప్ బిలో ఇంకా సూపర్-4 బెర్త్‌లు ఖరారు కాలేదు. మంగళవారం(సెప్టెంబర్ 5) శ్రీలంక- అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రిజల్ట్ తో గ్రూప్ బిలో సూపర్-4 బెర్త్ లు ఖరారు కానున్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్ చెరో రెండేసి పాయింట్లతో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. శ్రీలంకపై అఫ్గాన్ గెలిస్తే మూడు జట్ల పాయింట్లు సమం అవుతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. ఒకవేళ శ్రీలంకపై అఫ్గాన్‌ను ఓడిపోతే.. లంకతో పాటు బంగ్లాదేశ్ జట్టు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.