Asia Cup 2023 India Squad BCCI : మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నఆసియా కప్‌కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం బీసీసీఐ నిర్వహించనున్న సమావేశానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తోపాటు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకానున్నట్లు పలు వార్తా కథనాలు వెల్లడించాయి. బీసీసీఐ నిర్వహించే సమావేశంలో వన్డే ప్రపంచకప్ జట్టుకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
BCCI Meeting With Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాఫిట్‌నెస్ విషయంలో ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో బుమ్రా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా జాతీయ క్రికెట్ అకాడమీలో సిమ్యులేషన్ ప్రోగ్రాంలో ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆసియా కప్ జట్టు పరిశీలనలో రాహుల్ వస్తాడని.. శ్రేయస్ అయ్యర్ విషయంలోనే కాస్త సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం. ఫిట్‌గా ఉన్నప్పటికీ అతడిని ఆసియా కప్ కోసం ఎంపిక చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు.. యువ క్రికెటర్లు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌తోపాటు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్.. వీరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
Ind vs Pak Asia Cup 2023 Venue : ఈ నెల చివర్లో ఆసియా కప్.. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ప్రారంభం కానుంది. పాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌ను వీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ ఛైర్మన్ జైషాను పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్ ఆహ్వానించగా.. జైషా అంగీకరించినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను జైషా కొట్టిపడేశారు.