Asia Cup 2023 IND VS SL :ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భాగంగా టీమ్ఇండియా-భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే హైలైట్‌గా నిలిచాడు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓటమి తప్పలేదు. 41.3 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా సూపర్ ఫోర్ మ్యాచ్ లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫైనల్ కు అర్హత సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా 2, బుమ్రా 2, సిరాజ్, హార్దిక్ తలో వికెట్ తీశారు.
ఆదిలోనే షాకిచ్చిన బుమ్రా.. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు మంచి ఆరంభం దక్కలేదు. వారికి బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ నిశాంక (6) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మూడు బౌండరీలు బాది కాస్త ఊపులోకి వచ్చిన కుశాల్ మెండిస్ ను (15) బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కరుణరత్నె (2) కూడా సిరాజ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. దీంతో లంక 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. టాప్ ఆర్డర్ విఫలమైపోయింది. ఈ క్రమంలోనే చరిత్ అసలంక (21), సమరవిక్రమ (17) కాసేపు నిలకడగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే వీరిద్దరిని కుల్‌దీప్ విడదీశాడు. తన వరుస ఓవర్లలో ఔట్ చేసి పెవిలియన్ పంపాడు. సమరవిక్రమ స్టంపౌట్ అవ్వగా.. అసంక.. రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిసేపటికే శనక (9) జడేజా బౌలింగ్‌లో రోహిత్ చేతికి చిక్కాడు.
ఈ ఇద్దరే ఆదుకున్నారు... ఇక 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయిన లంకను దునిత్ వెల్లలాగె, ధనంజయ తమ ఇన్నింగ్స్ తో ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్ల సహనానికి కాసేపు పరీక్ష పెట్టారు. అయితే హాఫ్ సెంచరీ దిశగా సాగిన ధనంజయను జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మహీశ్ తీక్షణ (2), కాసున్ రజితా (1), పతిరన (0) వరుసగా ఔట్ అయిపోయారు. దునిత్ ఒక్కడే 42 అజేయంగా నిలిచాడు.
రోహిత్ ఒక్కడే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాలో బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ రోహిత్ శర్(53) ఒక్కడే కాస్త దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ టాప్ బ్యాటర్ గిల్(19), స్టార్ ప్లేయర్ కోహ్లీ(3) విమలమయ్యారు. మధ్యలో ఇషాన్ కిషన్(33), కేఎల్ రాహుల్(39) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లగా... ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(5), జడేజా(4) నిరాశ పరిచారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే (5/40) , చారిత్ అసలంక (4/14) టీమ్ఇండియాను బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. దీంతో భారత్ 49.1ఓవర్లో ఆలౌట్ అయి 213 పరుగులు చేసింది.