Asia Cup 2023 IND VS SL Dunith Wellalage : ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమ్ఇండియా.. లంకతో సూపర్ 4 మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే విజృంభించాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. టీమ్ఇండియా టాపార్డర్‌ను చిత్తు చేసి, భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకున్నాడు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ అనామక బౌలర్‌పై క్రికెట్ సర్కిల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
కెరీర్‌లో కనీసం 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగే.. టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. స్లో ట్రాక్‌పై లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన ఇతడు ఆకాశమే హద్దుగా చెలరేగి.. పటపటా వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇతడు సంధించిన బంతులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారు కూడా చేతులెత్తేశారు. టాప్ యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా వెల్లలగే చేతికే చిక్కి వికెట్లను సమర్పించుకున్నారు. వీరిలో రోహిత్, గిల్ క్లీన్‌బౌల్డ్‌లు అవ్వగా.. కోహ్లీ షనకకు, హార్దిక్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి ఔట్ అయ్యారు. కేఎల్ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.
దీంతో లంక క్రికెట్‌కు మరో మిస్టరీ స్పిన్నర్ దొరికాడని క్రికెట్ అభిమానులు.. వెల్లలగేను తెగ ప్రశంసిస్తున్నారు. సోషల్‌మీడియాలో అతడి ప్రదర్శనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తున్నారు. పటిష్టమైన భారత టాపార్డర్‌ను అడ్డుకోవడం.. బలమైన పాక్ బౌలర్ల వల్లనే కాలేదు, కానీ 20 ఏళ్ల వెల్లలగే మాత్రం చెమటలు పట్టించాడని అంటున్నారు.