Asia Cup 2023 Ind vs Pak :2023 ఆసియా కప్ సూపర్ 4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 24.1 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కూడా కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ వరుణుడు ఆట సజావుగా సాగనివ్వకపోతే.. మరోసారి మ్యాచ్ రద్దైయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో భారత్‌కు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది ఎలాగంటే..
రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే.. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకుంటాయి. దీంతో పాకిస్థాన్‌కు పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే పాక్ 3 పాయింట్లతో పట్టికలో టాప్‌లో ఉంటుంది. కానీ భారత్ 1 పాయింట్‌తో మూడో స్థానంలో ఉంటుంది. అయితే సూపర్ 4లో భారత్.. ఇంకా రెండు మ్యాచ్‌లు (శ్రీలంక, బంగ్లాదేశ్) ఆడాల్సి ఉంటుంది.
India Super 4 Match Schedule: భారత్.. ఎవరి ఫలితాలపైనా ఆధారపడకుండా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాలి. అప్పుడు 5 పాయింట్లతో భారత్ నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్తుంది. కానీ ఆ మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. లేదా ఆ రెండు మ్యాచ్‌లు రద్దైనా.. భారత్ ఖాతాలో మూడు పాయింట్లు చేరుతాయి. దీంతో భారత్ ఫైనల్స్ చేరుకోడానికి అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. అందుకని ఈ మ్యాచ్ సజావుగా సాగాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మంగళవారం భారత్.. శ్రీలంకతో ఇదే మైదానంలో ఆడాల్సి ఉంది.