Asia Cup 2023 IND VS PAK :భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ ఇరు జట్ల మధ్య పోరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. అయితే ప్రస్తుతం2023 ఆసియా కప్‌లో ఇప్పటికే భారత్-పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడిన సంగతి తెలిసిందే. అయితే లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వగా.. సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు. ఇక శ్రీలంకపై విజయంతో టోర్నీలో ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది భారత్. అయితే టీమ్ఇండియా.. మూడోసారి కూడా పాక్‌ను ఢీ కొట్టే ఛాన్స్ ఉంది. అదెలాగంటే తెలుసుకుందాం..
Asia Cup 2023 Points Table Super 4 : సూపర్ 4 దశలో రెండు వరుస విజయాలతో భారత్ 4 పాయింట్లతో టాప్‌లో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ రెండేసి మ్యాచ్‌లు ఆడి.. ఒక్కొక్కటి నెగ్గి వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక రెండు మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్.. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. అయితే సూపర్ 4 లో తరువాతి మ్యాచ్ పాకిస్థాన్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 14న గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది.