Asia Cup 2023 Ind Vs Ban : ఆసియా కప్ సూపర్- 4లో చివరి మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. భారత్ తుది జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
ఏకంగా ఐదు మార్పులతో..
బంగ్లాదేశ్‌తో జరిగేది నామమాత్రపు మ్యాచ్ కావడం వల్ల కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏకంగా ఐదు మార్పులు చేసింది మేనేజ్మెంట్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వడం విశేషం. వాళ్ల స్థానంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ టూర్లో టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఇప్పుడు వన్డేల్లో అడుగుపెడుతున్నాడు.
తిలక్ వర్మ అరంగేట్రం
Tilak Varma ODI Debut : ఈ టోర్నీలో ఇప్పటి వరకు కూడా మొదట ఫీల్డింగ్ చేసే అవకాశం రాకపోవడం వల్ల టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. టాస్ కంటే ముందు రోహిత్.. తిలక్ వర్మకు ఇండియా క్యాప్ అందించాడు. ఆసియా కప్‌లో ఇప్పటి వరకూ అసలు అవకాశం దక్కని సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌తో ఈ మ్యాచ్ ఇండియాకు మంచి ప్రాక్టీస్‌గా పనికి రానుంది.