Asia Cup 2023 Ban vs Afg : 2023 ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై బంగ్లాదేశ్పంజా విసిరింది. ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లా 89 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్ (112 రిటైర్డ్ హర్ట్; 119 బంతుల్లో 7×4, 3×6), నజ్ముల్ శాంటో (104; 105 బంతుల్లో 9×4, 2×6) శతకాలతో చెలరేగారు. చివర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (32 పరుగులు; 18 బంతుల్లో 4x4, 1x6) రాణించాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగుల స్కోర్ సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో దుల్బాదిన్ ఒక్కడికే ఒక వికెట్ దక్కింది. మిగతా నలుగురు బంగ్లా బ్యాటర్లు రనౌటై పెవిలియన్ చేరడం విశేషం. సూపర్ సెంచరీతో చెలరేగిన మిరాజ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండో ఓవర్లోనే యువ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జార్డన్ (75), వన్ డౌన్లో వచ్చిన రహ్మత్ షా (33), అఫ్గాన్ కెప్టెన్ అహ్మతుల్లా షాహిదీ (51) మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ (24 పరుగులు : 15 బంతుల్లో 3x4, 1x6) మెరుపులు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాయి. ఇక 44.3 ఓవర్లలో అఫ్గానిస్థాన్ జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3, హసమ్ మహ్మూద్, మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.