Asia cup 2022 venue: శ్రీలంకలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్‌ను యూఏఈకి తరలించాలని భావిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. టోర్నీని యూఏఈలోనే నిర్వహిస్తున్నట్లు కన్ఫార్మ్ చేసింది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు స్పష్టం చేసింది.
"ఆసియా కప్‌ను శ్రీలంకలోనే నిర్వహించాలని చివరి దాకా ప్రయత్నించాము. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో యూఏఈకి మారుస్తున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డే ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 ప్రపంచకప్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసారి జరగనున్న టోర్నీ ఆసియా దేశాల జట్లకు చాలా కీలకంగా మారింది. యూఏఈలో టోర్నీ నిర్వహణకు సహకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులకు ధన్యవాదాలు."