Asia Cup 2022 Schedule: ఆసియా కప్‌కు మరికొద్దిరోజుల్లో తెరలేవనుంది. 2016లో మాదిరి ఈసారి కూడా టీ-20 ఫార్మాట్లో జరగనుందీ టోర్నీ. శ్రీలంక, అఫ్గానిస్థాన్ పోరుతో ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న ఆడనుంది. సెప్టెంబర్ 11న ఫైనల్ జరగనుంది. శ్రీలంకలో జరగాల్సిన టోర్నీ అక్కడి పరిస్థితుల కారణంగా యూఏఈకి తరలిపోయింది. మరి.. ఈ టోర్నీ షెడ్యూల్, స్క్వాడ్స్, లైవ్ స్ట్రీమింగ్ సహా ఆసియా కప్ రికార్డుల గురించి చూద్దాం.
టీ-20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ టోర్నీలో ఈసారి మొత్తం 6 జట్లు మెయిన్ ఈవెంట్లో తలపడనున్నాయి. ఒక్కో గ్రూప్‌లో 3 జట్లతో రెండు గ్రూపులు ఉంటాయి. గ్రూప్- ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు వచ్చి చేరుతుంది. గ్రూప్- బీలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. లీగ్ దశలో ఒక్కో గ్రూప్‌లో ప్రతి జట్టు మిగతా టీంలతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. రెండు గ్రూపుల్లో చివరి స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేట్ అవుతుంది. మిగతా నాలుగు జట్లు సూపర్-4లో తలపడతాయి.
- సూపర్-4లో ప్రతి జట్టు మిగతా టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అక్కడ టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. అయితే.. భారత్, పాకిస్థాన్ ఫైనల్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు 3 సార్లు తలపడే అవకాశముంది.
- చివరిసారిగా ఆసియా కప్ 2018లో యూఏఈలోనే నిర్వహించారు. అప్పుడు భారత్ విజేతగా నిలిచి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇదే ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. శ్రీలంక ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరోవైపు పాకిస్థాన్ రెండే సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పసికూనలు కప్పు కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి. బంగ్లాదేశ్ 3 సార్లు ఫైనల్ చేరినా టైటిల్ గెల్చుకోలేకపోయింది.
- ఆసియా కప్ 2022 ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నాయి. ప్రతి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రోజుకు ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఫైనల్ జరగనుంది.
- ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఉన్నాడు. అతడు మొత్తం 1220 పరుగులు చేశాడు.
- అత్యధిక వికెట్ల వీరుడిగా లంకకే చెందిన దిగ్గజ బౌలర్ లసింత్ మలింగ ఉన్నాడు. మలింగ మొత్తం టోర్నీలో 33 వికెట్లు తీయడం విశేషం.
- 2023 ఆసియా కప్ టోర్నీ వన్డే ఫార్మాట్లో నిర్వహించనుండగా.. పాకిస్థాన్ వేదిక.