IND vs SL Asia Cup 2022 : చూస్తే.. జట్టు మామూలుగా లేదు. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో పొట్టి ఫార్మాట్లో ఆరితేరినవారే. అందుకే రాబోతున్న టీ20 ప్రపంచకప్‌లో గట్టి పోటీదారుగా భావిస్తున్న టీమ్‌ఇండియా.. ఆసియాకప్‌లోనైతే తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. బుమ్రా లేకున్నా.. జడేజా అర్ధంతరంగా నిష్క్రమించినా ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. జట్టు బలంపై అంత నమ్మకం. కానీ టీమ్‌ఇండియాకు షాక్! ఆ జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకూ షాక్!
ఏమాత్రం ఊహించని విధంగా, పేలవ ప్రదర్శనతో సూపర్-4లో వరుసగా రెండో పరాజయం చవిచూసిన రోహిత్‌సేన ఫైనల్‌కే దూరమయ్యే స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌లో చెలరేగలేకపోయిన భారత్.. బంతితోనూ విఫలమై శ్రీలంక చేతిలో కంగుతింది. టీమ్‌ఇండియా బౌలింగ్‌లో ఆలస్యంగా పుంజుకుని విజయం కోసం ప్రయత్నించినా.. ఉత్కంఠగా ముగిసిన పోరులో ప్రత్యర్థి ఆధిపత్యం స్పష్టం. రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీలంక ఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉన్న భారత్ సాంకేతికంగా మాత్రం ఫైనల్ రేసులో ఉంది. కథ ముగిసినట్లే! ఏ చిన్న అవకాశమైనా ఉండాలంటే పాకిస్థాన్ జట్టు.. అఫ్గాన్, లంక చేతిలో ఓడిపోవాలి.
ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్ రేసుకు దూరమైనట్లే. మంగళవారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ (72; 41 బంతుల్లో 5×4, 4×6) ఒక్కడు మెర]వడంతో మొదట భారత్ 8 వికెట్లకు 173 పరుగులు సాధించింది. కుశాల్ మెండిస్ (57; 37 బంతుల్లో 4×4, 3×6), నిశాంక (52; 37 బంతుల్లో 4×4, 2×6), శనక (33 నాటౌట్; 18 బంతుల్లో 4×4, 1×6), భానుక రాజపక్స (25 నాటౌట్; 17 బంతుల్లో 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చాహల్ (3/34) బంతితో రాణించాడు. భారత్ తన తొలి సూపర్-4 మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
లంక ఓపెనర్ల జోరు:అటు నిశాంక.. ఇటు కుశాల్ మెండిస్! కొడుతూనే పోయారు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు బాదేశారు. ఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్లను ఏమాత్రం లెక్క చేయలేదు. బౌలర్లంతా తేలిపోయారు. ఆరంభంలో భువి మినహా ఎవరూ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్, చాహల్, అశ్విన్.. ఇలా ఎవ్వరొచ్చినా లంక ఓపెనర్లపై ప్రభావం చూపలేకపోయారు. ప్రత్యర్థి వడవడిగా లక్ష్యం దిశగా సాగింది. 11 ఓవర్లలో 97/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఆశలు అడుగంటుతున్న దశలో చాహల్.. ఒకే ఓవర్లో (12వ) నిశాంక, అసలంకను ఔట్ చేసి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత గుణతికలను అశ్విన్ ఔట్ చేయడం, తన తర్వాతి ఓవర్లో కుశాల్ మెండిస్‌ను చాహల్ ఔట్ చేయడంతో భారత్ పోటీలోకి వచ్చేసింది. 13 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. చివరి అయిదు ఓవర్లలో లంక 54 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ భారత్ ఆధిపత్యం ఆ కొన్ని ఓవర్లే. ఆ తర్వాత మరో వికెట్ దక్కలేదు. ఒత్తిడిలో ధాటిగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ శనక, భానుక రాజపక్స టీమ్‌ఇండియా ఆశలపై నీళ్లు చల్లారు. అభేద్యమైన అయిదో వికెట్‌కు 64 పరుగులు జోడించి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు.
భువి మళ్లీ..:శ్రీలంక స్పష్టంగా పైచేయిలో ఉన్నా.. అంత తేలిగ్గానైతే లక్ష్యాన్ని అందుకోలేదు. కాస్త ఉత్కంఠ తప్పలేదు. భారత్ కూడా మంచి అవకాశాన్నే సృష్టించుకుంది. కానీ పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో లాగే భువి మరోసారి 19వ ఓవర్లో బౌలింగ్ చేయడం ప్రతికూలంగా మారింది. చివరి రెండు ఓవర్లలో లంకకు 21 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్లో భువి 14 పరుగులిచ్చాడు. ఇందులో రెండు వైడ్లు కూడా ఉన్నాయి.