పాకిస్థాన్ బెంబేలు, భువీ, పాండ్య వికెట్ల వేట, టార్గెట్ ఎంతంటే - ఇండియా పాక్ న్యూస్
21:24 August 28
పాకిస్థాన్ బెంబేలు, భువీ, పాండ్య వికెట్ల వేట, టార్గెట్ ఎంతంటే
చిరాకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమ్ఇండియా ఓ ఆటాడుకుంది. ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఆరంభం నుంచి పాక్‌ను దెబ్బమీద దెబ్బ కొడుతూ ఆధిపత్యం చెలాయించింది. దీంతో పాక్ 147 పరుగులకే పరిమితమైంది. ఒక బంతి మిగిలి ఉండగానే మొత్తం 10 వికెట్లు కోల్పోయింది చివర్లో పాక్ బ్యాటర్లు కాస్త మెరవడం వల్ల.. ఆ జట్టు కాస్త పోరాడగలిగే స్కోరు చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాంసించాడు. హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో సత్తా చాటాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. తొలి ఓవర్లోనే రెండు వికెట్లో కోల్పోయే ప్రమాదం నుంచి పాక్ తప్పించుకుంది. భారత్ చేసిన ఎల్బీడబ్ల్యూ అప్పీలుకు అంపైర్ ఔట్ ఇవ్వగా.. పాక్ రివ్యూకు వెళ్లింది. రివ్యూలో బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో పాక్ కీపర్ రిజ్వాన్(43) బతికిపోయాడు. అదే ఓవర్లో బాబర్ ఆజమ్ క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. కానీ అతడికి ఆ అదృష్టం ఎంతోసేపు నిలవలేదు. మూడో ఓవర్లోనే భువీ బాబర్‌ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత ఫకర్ జమాన్, ఇఫ్తిఖర్ అహ్మద్ కుదురుకునేందుకు ప్రయత్నించారు.
అయితే, వారికి అవేష్ ఖాన్, పాండ్య పెవీలియన్‌కు దారి చూపించారు. అనంతరం పాక్ బ్యాటర్లు వచ్చినంతసేపు కూడా క్రీజులో నిలవలేక పోయారు. మధ్య ఓవర్లలో పాండ్య మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్ రెండు, అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. భువీ చివర్లో మూడు వికెట్లు తీశాడు. ఆఖర్లో హారిస్ రౌఫ్, షానవాజ్ దహానీ కాస్త మెరుపులు మెరిపించారు. దీంతో పాక్ స్కోరుబోర్డు కాస్త వేగం పుంజుకుంది.