తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia cup ఈ అద్భుతాలు తెలుసా - ఆసియా కప్​ 2022 టీమ్​ఇండియా చరిత్ర

Asia cup 2022 History records క్రికెట్‌ అభిమానులకు మరి కొన్ని గంటల్లో క్రికెట్‌ పండగ మొదలవనుంది. ఆసియా కప్‌ 2022 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టీమ్​ఇండియా పాకిస్థాన్​ పోరు చూసే అదృష్టం దక్కింది. ఈ నేపథ్యంలో అసలు ఈ టోర్నీని ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించారు, ఏ జట్టు పైచేయి సాధించింది వంటి విషయాలు తెలుసుకుందాం

Asia cup 2022 History records
ఆసియా కప్​ టీమ్​ఇండియా రికార్డ్స్​

By

Published : Aug 27, 2022, 11:57 AM IST

Asia cup 2022 History records మరి కొన్ని గంటల్లో క్రికెట్​ ప్రియులకు మస్తు మజానిచ్చే ఆసియా కప్​ 2022 ప్రారంభంకానుంది. ఇందులో భాగంగానే దాయాదుల పోరు(టీమ్​ఇండియా వర్సెస్​ పాకిస్తాన్​) చూసే అవకాశం దక్కింది. అసలు ఈ టోర్నీని ఎందుకు ప్రారంభించారు, ఈ టోర్నీ చరిత్ర ఏంటి? ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించారు. ఏ జట్టు పైచేయి సాధించింది వంటి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

  • ఆసియాలో క్రికెట్‌ ఆటను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి 1983లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్థాపించారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ICC) ఆధీనంలో ఉన్న ప్రాంతీయ పరిపాలనా సంస్థ. ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
  • ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా కప్ అనేది పురుషుల వన్డే, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్. ఇది ఆసియా దేశాల మధ్య సద్భావనను పెంపొందించే చర్యగా 1984లో తొలిసారి యూఏఈ వేదికగా ప్రారంభించారు. ప్రస్తుతం 15వ ఎడిషన్‌ ఆసియాకప్‌ కూడా యూఏఈ(UAE)లోనే జరగనుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు జరగాల్సి ఉండగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాలుగేళ్లకొకసారి నిర్వహించారు.
  • ఇప్పటివరకు జరిగిన 14 ఆసియాకప్‌లలో ఆడిన ఏకైక జట్టు శ్రీలంక. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ 13 సార్లు పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986లో టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ నిర్వహించలేదు. భారత్‌తో రాజకీయ సంబంధాలు సరిగా లేనందున పాక్‌ 1990-91 టోర్నీలో పాల్గొనలేదు.
  • 2015లో ఏసీసీ అధికారాలను ఐసీసీ తగ్గించి, ఇక నుంచి ఆసియాకప్‌ వన్డే, టీ20 ఫార్మాట్‌లలో రొటేషన్‌ పద్ధతి ఆధారంగా జరుగుతుందని ప్రకటించింది. ఐసీసీ టోర్నమెంట్‌లకు అనుగుణంగా ఆసియాకప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫలితంగా 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌ వేదికగా తొలిసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ను నిర్వహించారు. ఆ తర్వతా 2018లో వన్డే ఫార్మాట్‌లో జరగ్గా, ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్‌ నిర్వహిస్తారు.

రికార్డులు, విశేషాలు...

  • టోర్నమెంట్ ఫార్మాట్ : రౌండ్ - రాబిన్ లీగ్‌
  • అత్యంత విజయవంతమైన జట్టు: భారత్‌ (7 టైటిల్స్)
  • డిఫెడింగ్‌ ఛాంపియన్‌: భారత్‌ (2018)
  • అత్యధిక సార్లు ఫైనల్‌ చేరిన జట్టు: శ్రీలంక (11)
  • అత్యధిక సార్లు నిర్వహించిన దేశం: బంగ్లాదేశ్‌ (5)
  • అత్యధిక పరుగులు : సనత్ జయసూర్య (1220), శ్రీలంక
  • అత్యధిక సెంచరీలు: సనత్ జయసూర్య (6), శ్రీలంక
  • అత్యధిక వికెట్లు: ముత్తయ్య మురళీధరన్‌ (90), శ్రీలంక
  • అత్యధిక క్యాచులు:మహేల జయవర్థనే (15), శ్రీలంక
  • కెప్టెన్‌గా అత్యధిక మ్యాచులు:ఎంఎస్‌ ధోని (14), భారత్‌
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు:విరాట్ కోహ్లి (183), భారత్‌
  • వన్డే ఫార్మాట్‌లో తొలి సెంచరీ:మొయిన్‌ ఉల్‌ హక్‌ (పాకిస్థాన్‌)
  • టీ20 ఫార్మాట్‌లో తొలి సెంచరీ:బాబర్‌ హయాత్‌ (హాంకాంగ్‌)
  • వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్:అజంతా మెండిస్ (‌6/13), శ్రీలంక
  • టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్:లసిత్‌ మలింగ (4/26), శ్రీలంక
  • వన్డేల్లో ఒక జట్టు అత్యధిక స్కోరు :పాకిస్థాన్‌ (385/7)
  • టీ20ల్లో ఒక జట్టు అత్యధిక స్కోరు:ఇండియా (166/8)
  • ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు:అజంతా మెండిస్ (17), 2008
  • ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు:సనత్ జయసూర్య (378), 2008
  • ఆసియా కప్‌లో అరంగేట్రం చేసిన జట్లు
    1984:భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక
    1986:బంగ్లాదేశ్‌
    2004:యూఏఈ, హాంకాంగ్‌
    2014:అఫ్గానిస్థాన్‌

ఆసియాకప్‌ విజేతలు

  • తొలిసారి 1984లో యూఏఈ వేదికగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించింది.
  • ఇక రెండోసారి 1986 (శ్రీలంక)లో జరిగిన ఆసియాకప్‌లో శ్రీలంక టైటిల్‌ సాధించింది. ఫైనల్‌లో పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది.
  • బంగ్లాదేశ్‌ వేదికగా 1988లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో నెగ్గి భారత్ రెండోసారి విజేతగా నిలిచింది.
  • 1990-91 (భారత్‌)లో జరిగిన ఈ టోర్నీని టీమ్‌ఇండియా గెలిచి మరోసారి హ్యాట్రిక్‌ కొట్టింది. టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో లంకను ఓడించింది.
  • యూఏఈ వేదికగా జరిగిన 1995 టోర్నీలో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి లంకను ఫైనల్లో వరసుగా నాలుగుసార్లు బోల్తాకొట్టించింది.
  • 1997లో సొంతగడ్డపై భారత్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి, లంక తొలిసారి భారత్‌పై ఫైనల్లో నెగ్గింది.
  • బంగ్లాదేశ్‌ వేదికగా 2000లో జరిగిన టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై 39 పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆసియాకప్‌ టైటిల్‌ను గెలుచుకొంది.
  • శ్రీలంక 2004లో సొంతగడ్డపై భారత్‌ను 25 పరుగుల తేడాతో ఓడించి మరోసారి టైటిల్ సాధించింది.
  • 2008లో పాకిస్థాన్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌ మళ్లీ ఫైనల్‌లో లంక చేతిలో పరాజయం పాలైంది. ఫైనల్‌లో లంక 100 పరుగుల తేడాతో నెగ్గి నాలుగోసారి ఛాంపియన్‌ అయింది.
  • ఇక 2010 (శ్రీలంక)లో మళ్లీ భారత్, శ్రీలంక జట్లే ఫైనల్లో తలపడ్డాయి. అయితే, ఈ సారి టీమ్‌ఇండియా 81 పరుగుల తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకొంది.
  • బంగ్లాదేశ్‌ వేదికగా తర్వాతి మూడు ఆసియాకప్‌లు జరిగాయి. 2012లో బంగ్లాపై రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి పాక్‌ మరోసారి కప్‌ కొట్టింది.
  • 2014లో పాక్‌, లంక ఫైనల్‌లో పోటీపడగా, శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదో టైటిల్‌ తన ఖాతాలో వేసుకొంది.
  • ఇక 2016 తొలిసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ నిర్వహించారు. భారత్‌ ఫైనల్‌లో బంగ్లాను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆరోసారి ఆసియాకప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించింది.
  • 2018లో యూఏఈ వేదికగా ఈ సారి వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్‌ జరిగింది. మరోసారి భారత్‌, బంగ్లానే ఫైనల్‌లో పోటీపడగా..టీమ్‌ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ గెలిచింది.
  • ఈ ఏడాది ఆసియా కప్‌ ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. మరీ ఈ సారి టైటిల్‌ ఎవరిని వరిస్తుందో చూడాలి!

ఇదీ చూడండి:ఆసియా కప్‌ సమరానికి సిద్ధం, ఈసారి అంతకుమించి

ABOUT THE AUTHOR

...view details