ఆరు జట్లు.. మొత్తం 13 మ్యాచ్‌లు.. 16 రోజులు.. చివరకు ఒక విజేత. శనివారం ఆరంభమయ్యే ఆసియా కప్‌లో తొలి రోజు శ్రీలంక, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆరేళ్ల తర్వాత తిరిగి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగబోతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2016 నుంచి ఆసియా కప్ తర్వాత ఏ ప్రపంచకప్ ఉంటే.. అందుకు సన్నాహకంగా ఈ టోర్నీని అదే ఫార్మాట్లో రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. 2016లో టీ20, 2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు పొట్టి ఫార్మాట్లోనే జట్లు తలపడతాయి.
అంతకుమించి..ఆసియా కప్‌లో ఈ సారి జట్ల మధ్య మరింత పోటీ ఉండడం ఖాయమనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆసియా జట్ల ఆట ప్రమాణాలు పెరగడమే అందుకు కారణం. ఈ సారి టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ బరిలో దిగాయి. హాంకాంగ్‌ను మినహాయిస్తే మిగతా అయిదు జట్లు కూడా ఉత్తమ ప్రదర్శన చేసేవే. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేస్తాయి. అందుకే ఈ సారి ఎప్పుడూ లేనంత నాణ్యమైన క్రికెట్‌ను చూసే అవకాశం ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గ్రూప్- ఎలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, గ్రూప్- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.
కూర్పు కోసం..ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడించే తమ జట్లపై తుది అంచనాకు వచ్చేందుకు ఈ దేశాలకు ఇదే మంచి అవకాశం. ఈ టోర్నీలో ఆడే జట్లనే దాదాపుగా ప్రపంచకప్ బరిలో దించే ఆస్కారముంది. అందుకే అన్ని జట్లూ తమ కూర్పుపై దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు. రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్.. మరోసారి టైటిల్‌పై కన్నేసింది. పేస్ బౌలింగ్‌లో అనుభవ లేమి మినహా జట్టు బలంగానే ఉంది. కానీ ఈ టోర్నీలో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. వరుసగా విఫలమవుతున్న అతను ఈ టోర్నీతో తిరిగి ఫామ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.