Ashwin World Cup 2023 :వన్డే ప్రపంచకప్‌లో ఓటమిని ఎవరూ మర్చిపోలేరు. వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమ్ఇండియా ఒక్క సారిగా ఓటమి పాలవ్వడాని క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. గెలుపు మనదే అనుకున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడి మన ప్లేయర్లక షాకిచ్చింది. దీంతో రోహిత్ సేనకు పరాభవం తప్పలేదు. ఆ సమయంలో ఎంతో మంది ఏడ్చారు. ఇక టీమ్ఇండియా ప్లేయర్లు కూడా నిరాశతో వెనుతిరిగారు. తాజాగా ఈ విషయంపై టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ మాట్లాడాడు. మ్యాచ్ తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఘోరంగా ఏడ్చారని.. వారి పరిస్థితిని చూడలేకపోయామంటూ అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన తోటి ప్లేయర్ల కూడా భావోద్వేగానికి లోనయ్యారని తెలిపాడు.
"ఆరోజు మేమందరం చాలా బాధపడ్డాం. ఇక రోహిత్, కోహ్లి అయితే ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరిని అలా చూసి మాకు మరింత బాధగా అనిపించింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న జట్టు మన టీమ్ఇండియా. కచ్చితంగా గెలుస్తుందనే అందరం అనుకున్నాం. టీమ్‌లోని ప్లేయర్లందరూ తమ రోల్‌ను చక్కగా పోషించారు. కానీ ఆఖరికి చేదు అనుభవమే ఎదురైంది. సహజంగానే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఆ ఇద్దరు లీడర్లు ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి వాళ్లను మరింత మెరుగుపడేలా చేశారు" అని రోహిత్, కోహ్లిని అశ్విన్ ప్రశంసించాడు.