తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: అశ్విన్‌ నెం.1.. దూసుకొచ్చిన కోహ్లీ.. ఏకంగా 8 స్థానాలను.. - ఐసీసీ ర్యాంకింగ్స్​ రోహిత్​

ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా ఆటగాళ్లు అశ్విన్, విరాట్​ కోహ్లీ​ అదరగొట్టారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల విభాగాల్లో తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

icc rankings
icc rankings

By

Published : Mar 15, 2023, 4:49 PM IST

ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో టీమ్​ఇండియా 2-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్​లో అదరగొట్టిన భారత క్రికెటర్లు.. ఐసీసీ ర్యాంకింగ్స్​లోనూ దూసుకొచ్చారు. ఆసీస్​తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్​లో సెంచరీతో వీరవిహారం చేసిన టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 705 పాయింట్లతో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్​ పంత్​.. 9వ స్థానంలోనే ఉన్నాడు. టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ 739 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ 800 పాయింట్లతో నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ బ్యాటర్ మార్నస్‌ లబుషేన్ 915 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్ట్​ బౌలర్ల ర్యాంకింగ్స్​లో బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అందుకున్న టీమ్​ఇండియా సీనియర్​ ఆల్​రౌండర్​ రవిచంద్రన్​ అశ్విన్​ తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇంతకుముందు వరకు జేమ్స్‌ అండర్సన్‌ (859)తో కలిసి సంయుక్తంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన అశ్విన్‌ పది పాయింట్లను అదనంగా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 869 పాయింట్లతో అశ్విన్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో టాప్‌-10 బౌలర్ల జాబితాలో అశ్విన్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు.

ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు టీమ్​ఇండియా ఆటగాళ్లవే. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ను ఉమ్మడిగా గెలుచుకున్న టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా (431), రవిచంద్రన్ అశ్విన్ (359) వరుసగా మొదటి, రెండో ర్యాంక్‌లో నిలిచారు. కాగా, బ్యాటింగ్‌లో రాణించి.. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ కూడా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐసీసీ టాప్‌ ర్యాంకింగ్స్‌లో జట్లపరంగా పెద్దగా మార్పుల్లేవు. అయితే పాయింట్ల పరంగా మాత్రం ఆసీస్‌కు భారత్ దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లాండ్ (106), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్‌ (88), శ్రీలంక (88), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్‌ (46), అఫ్గానిస్థాన్ (40) టాప్‌ -10లో నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details