Ashwin On Friendship Comments : ప్రస్తుత తరం భారత జట్టులోని ఆటగాళ్లు స్నేహితులుగా మారడం కష్టమని ఇటీవల వ్యాఖ్యానించాడు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యూట్యూబ్ వేదికగా తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్తాజాగా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే?
నా వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్నారు..
Ravichandran Ashwin Youtube Channel : 'నేను చేసిన వ్యాఖ్యలను బయట మరో విధంగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పిన అంశం ఒకటి.. అభిమానులు అర్థం చేసుకున్నదొకటి. గతంలో టీమ్ఇండియా పర్యటనలు చాలా ఎక్కువ కాలం సాగేవి. అప్పుడు ఆటగాళ్ల మధ్య స్నేహం కుదరడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో మాత్రం మూడు వేర్వేరు ఫార్మాట్లను ఎక్కువగా ఆడుతున్నాం. వేర్వేరు జట్లుగా విడిపోయి బరిలోకి దిగుతున్నాం. అందుకే, వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం కుదరడానికి ఆస్కారం తక్కువగా ఉందని భావిస్తున్నా. అదేవిధంగా ఐపీఎల్ ఉండటం వల్ల కూడా ఆటగాళ్ల మధ్య స్నేహం కంటే పోటీ పెరిగింది. దాదాపు 3 నెలలపాటు భారత జట్టులోని సహచరులే ప్రత్యర్థులుగా మారతారు. అలాగనీ స్నేహం కుదరకుండా ఉండదని చెప్పడం లేదు. కానీ, అలా అయ్యేందుకు ఆస్కారం తక్కువని చెబుతున్నా' అని అశ్విన్అన్నాడు.