వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వచ్చే సీజన్‌లో ఫ్రాంఛైజీ మారడం ఖాయమేననిపిస్తోంది.
"చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీతో నాకు మంచి అనుబంధం ఉంది. చెన్నై జట్టు నాకు పాఠశాల లాంటిది. క్రికెటర్‌గా ఓనమాలు నేర్చుకుంది ఇక్కడే. ప్రీ కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఉన్నత చదువుల కోసం బయటకి వెళ్లాను. చదువులు పూర్తయ్యాక ఎవరైనా.. ఇంటికి రావాల్సిందే. నేను కూడా నా సొంత ఇంటికి (చెన్నై)కి రావాలనుకుంటున్నాను. ఇదంతా త్వరలో జరగనున్న ఐపీఎల్ వేలంపై ఆధారపడి ఉంది. అక్కడ జరిగే పరిణామాలను అర్థం చేసుకోగలను. ఐపీఎల్‌లో పాల్గొనే 10 జట్లు పది రకాల వ్యూహాలతో వస్తాయి. నన్ను ఏ జట్టు దక్కించుకుంటుందో చెప్పలేను. కానీ, ఓ ప్రొఫెషనల్ ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాను. మనపై నమ్మకంతో ఫ్రాంఛైజీ ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాను"
-- రవిచంద్రన్ అశ్విన్, టీమ్‌ఇండియా స్పిన్నర్.
2008లో అన్‌క్యాప్డ్ ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి అడుగు పెట్టిన అశ్విన్ 2015 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్ జాయింట్స్ (2016-17), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2018-19), దిల్లీ క్యాపిటల్స్ (2020-21) జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు.