Steve Harmison on Ravi Ashwin: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి.. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేను ఆడించినా ఆశ్చర్యపోనని ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయినా, అతడిని టీమ్‌ఇండియా ఆ సిరీస్‌లో ఎంపిక చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు యాజమాన్యం పక్కనపెట్టిందని హార్మిసన్ గుర్తుచేశాడు.
"జట్టు ఎంపికలో కెప్టెన్ కోహ్లీ నిర్ణయాలే కీలకం. కానీ అతడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్, మయాంక్ శతకాలు బాదారు. దీంతో వారిద్దరూ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లొచ్చని అనుకోవచ్చు. అలాగే రహానే, పుజారాను తుది జట్టులోకి తీసుకున్నా.. అశ్విన్‌ను పక్కనపెట్టినా.. నేను ఆశ్చర్యపోను. జడేజా కీలక ఆటగాడు. అక్షర్, అశ్విన్ లాంటి స్పిన్నర్లు బ్యాటింగ్ చేయగలిగినా జడేజానే ఏడో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్. కాకపోతే.. అశ్విన్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ఎందుకంటే అతడు సీమ్ బౌలర్లకు ఏమాత్రం తక్కువ కాదు."