Ashwin Buttler: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌కు స్వాగతం చెప్పాడు ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్. శనివారం జరిగిన వేలంలో అశ్విన్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్. అయితే వీరిద్దరూ 2019లో జరిగిన మన్కడింగ్ వివాదం అనంతరం.. ఒకే జట్టుకు కలిసి ఆడనుండటం ఆసక్తి కలిగిస్తోంది.
"హేయ్ ఆశ్.. నేను క్రీజు లోపలే ఉన్నాను. బాధపడకు (నవ్వుతూ). రాయల్స్ కోసం నిన్ను పింక్ జెర్సీలో చూడాలని ఉంది. నీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నా" అని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో అన్నాడు బట్లర్.
ఇదీ వివాదం..
అశ్విన్ 2020 నుంచి 2021 వరకు దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. 2019లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అశ్విన్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ను మన్కడింగ్ చేయడం వల్ల పెను వివాదం చెలరేగింది. నిబంధనల ప్రకారం అలా చేసేందుకు అనుమతి ఉన్నా.. దానిని చాలామంది వ్యతిరేకించారు. ఇప్పుడు కొన్ని వారాల్లో వాళ్లు డ్రెస్సింగ్‌రూమ్ పంచుకోనుండడం ఆసక్తి కలిగిస్తోంది.
అయితే అశ్విన్ కూడా రాజస్థాన్ జట్టులోకి వెళ్లడం ఆనందంగా ఉందని చెప్పాడు. బట్లర్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం బాగుంటుందని అన్నాడు.