ICC Test Cricketer of the year: ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు కోసం నలుగురు నామినేట్ అయ్యారు. భారత్ టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్ కరుణరత్నె నామినేట్ అయినట్లు ఐసీసీ పేర్కొంది.
ఈ ఏడాదిలో ఎనిమిది మ్యాచుల్లోనే 52 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు అశ్విన్. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ ప్రతిభ చూపాడు. 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది.
ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ 15 మ్యాచుల్లో 1,708 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉన్నాయి. అయితే బ్యాటర్‌గా రాణించిన రూట్.. సారథిగా మాత్రం విఫలమయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను మరో రెండు టెస్టులు ఉండగానే కోల్పోయాడు.
అలానే కివీస్ ఆటగాడు కైల్ జేమీసన్ అద్భుత ప్రదర్శనే ఇచ్చాడు. ఐదు మ్యాచుల్లో 17.51 యావరేజ్‌తో 27 వికెట్లు తీశాడు. ఇక నాలుగో ఆటగాడు శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నె ఏడు టెస్టుల్లో నాలుగు సెంచరీల సాయంతో 902 పరుగులు చేశాడు. వెస్టిండీస్ మీద ద్విశతకం కూడా సాధించాడు.