Ashwin about West Indies Stadiums : 'మేము విలాసాలను కోరుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించండి చాలు'.. అని వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య చేసిన విన్నపం. ఇక ఇదే అంశంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తావించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని పేర్కొన్న అశ్విన్.. మైదానాల్లో మౌలిక సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
" వెస్టిండీస్‌లో క్రికెట్ వృద్ధి చెందాలంటే మొదట మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. అండర్-10, అండర్-12, అండర్-14 ఆటగాళ్లకు కూడా మంచి నెట్స్, గ్రౌండ్ ఉండేలా చూడాలి. అప్పుడే వారిలో ఇంట్రెస్ట్ పెరిగి క్రికెట్ ఆడేందుకు ముందుకొస్తారు. ఇది టాలెంట్‌తో కూడిన గేమ్. దీని కోసం బాగా శ్రమించాలి. అయితే మైదానాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. వెస్డిండీస్ భౌగోళికంగా విభిన్నంగా ఉంటుంది. బార్బడోస్‌లో టెస్టు మ్యాచ్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాం. అక్కడ కనీసం పచ్చిక కూడా లేదు. ఆ నెట్స్ కూడా చాలా పాతవిగా ఉన్నాయి. అయితే, నేను ఇలా చెప్పడానికి కారణం వారిని తప్పుబట్టడానికి కాదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు విండీస్ ఆటగాళ్లు కూడా ఎంతని కష్టపడాలి? ఇలాంటి పిచ్‌ల పై ప్రాక్టీస్ చేసిన తర్వాత.. వారు భారత్ వంటి మంచి పిచ్‌లపై ఆడేందుకు అవస్థలు పడతారు. దీంతో ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్‌లు చాలా మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. అయితే, విండీస్‌లో మాత్రం పచ్చికను తొలగించి రోలర్‌తో అటు ఇటూ తిప్పేసి అదే నిర్వహణగా వారు భావిస్తున్నారు. ఈ విషయంపై టెస్టు సిరీస్ సందర్భంగానూ మాట్లాడాను. అలా చేయడం చాలా సులువే. కానీ పిచ్ నిర్జీవంగా మారి మందకొడిగా ఉంటుంది" అని అశ్విన్ తెలిపాడు.