131 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ప్రస్తుత సీజన్లో ఓ బ్యాటర్ అత్యంత జిడ్డు బ్యాటింగ్ ఆడి ఆకట్టుకున్నాడు. షీల్డ్ 2022-23 ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విక్టోరియా ప్లేయర్ ఆష్లే చంద్రసింఘే.. 403 నిమిషాల పాటు క్రీజులోనే నిలబడి రికార్డుకెక్కాడు. ఆచితూచి ఒక్కో బంతిని ఎదుర్కొన్నాడు. మొత్తంగా 280 బాల్స్‌ను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో.. షీల్డ్ టోర్నీలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 1997-98 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్మానియా ప్లేయర్ జేమీ కాక్స్ కూడా ఇలాంటి ప్రదర్శనే చేశాడు. 267 బాల్స్‌ను ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచి ఆకట్టుకున్నాడు.
అయితే ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరి కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే షీల్డ్ ఫైనల్లో కనీసం అర్ధ శతకం కూడా చేయకుండా చివరి వరకు క్రీజులో నిలబడిన ఓపెనర్‌గానూ ఘనత సాధించాడు. 16.43 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన చంద్రసింఘే.. ఫస్ట్ రన్ చేసేందుకు ఏకంగా 49 బంతులను తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలా పలు రికార్డును తన పేరిట రాసుకున్నాడు.