తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన బ్రూక్‌.. బోణీ కొట్టిన ఇంగ్లాండ్‌.. సిరీస్​ ఆశలు సజీవం

Ashes 2023 : యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​ ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడో టెస్టులో బోణీ కొట్టి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Ashes 2023 England VS Australia
చెలరేగిన బ్రూక్‌.. ఎట్టకేలకు బోణీ కొట్టిన ఇంగ్లాండ్‌..

By

Published : Jul 9, 2023, 8:27 PM IST

Updated : Jul 9, 2023, 9:17 PM IST

Ashes ENG vs AUS 2023 Test : యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తొలి విక్టరీ కొట్టింది. వరుస రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ విజయం సాధించగా.. కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ సత్తా చాటింది. ఆసీస్‌ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఛేదించి.. సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 2-1కు చేరింది. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (75; 93 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో, జాక్ క్రాలీ (44; 55 బంతుల్లో 5 ఫోర్లు)పరుగులతో రాణించారు. చివర్లో మార్క్‌ వుడ్ (16; 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5, కెప్టెన్‌ కమిన్స్‌, మార్ష్‌ చెరో వికెట్‌ తీశారు.

27/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. డకెట్‌ (23)ను మిచెల్‌ స్టార్క్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్‌ అలీ (5) కూడా స్టార్క్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. నిలకడగా ఆడుతున్న జాక్‌ క్రాలీ.. మిచెల్ మార్ష్‌ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్‌.. జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జో రూట్ (21) కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్‌ 131 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లిష్‌ జట్టు 153/4తో నిలిచింది.

మార్క్​ వుడ్​ మెరుపులతో..
భోజన విరామం నుంచి రాగానే బెన్‌ స్టోక్స్‌ (13), బెయిర్‌ స్టో (5)లను మిచెల్ స్టార్క్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ పైచేయి సాధించినట్లు కనిపించింది. ఈ తరుణంలో క్రిస్‌ వోక్స్‌, బ్రూక్‌ నిలకడగా బౌండరీలు బాదడంతో ఇంగ్లాండ్‌ విజయానికి చేరువైంది. కానీ, ఇంతలోనే బ్రూక్‌ను ఔట్‌ చేసి స్టార్క్‌ ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది. అప్పటికి ఇంగ్లిష్‌ జట్టు విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మార్క్‌ వుడ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ గట్టెక్కింది. ఆసీస్‌ తొలి, రెండు ఇన్నింగ్స్‌లు 263/10, 224/10. ఇంగ్లాండ్‌ 237/10, 254/7.

Last Updated : Jul 9, 2023, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details