Ashes 2021: ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. డే/నైట్ టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 236 పరుగులకే కుప్పకూలింది. పేసర్ మిచెల్ స్టార్క్ నాలుగు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేయండంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఓపెనర్ రోరీ బర్న్స్‌ను ఆదిలోనే పెవిలియన్ చేర్చిన స్టార్క్.. డేవిడ్ మలన్(80)ను కూడా ఔట్ చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్, స్టువర్ట్ బ్రాడ్ కూడా స్టార్క్ చేతికే చిక్కారు. దీంతో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్ 37 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. పింక్ బాల్ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో 50 వికెట్లు తీసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు.