Arshdeep Singh Catch : ఆసియాకప్ సూపర్ 4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్ వదిలేసిన భారత్ బౌలర్ అర్ష్‌దీప్ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఈ క్రమంలో వస్తోన్న కామెంట్లపై అర్ష్‌దీప్ ఎలా స్పందించాడో అతడి తల్లిదండ్రులు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ట్రోలింగ్‌ను అతడు చాలా తేలిగ్గా తీసుకొన్నట్లు పేర్కొన్నారు.
అర్ష్‌దీప్ సద్విమర్శలను స్వీకరించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడని అతడి తండ్రి తెలిపారు. "ఈ ట్వీట్లు, మెసేజ్‌లను చూసి నవ్వుకున్నాను. వాటిల్లో సానుకూలమైనవాటినే స్వీకరించాను. ఈ ఘటన నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది' అని అర్ష్‌దీప్ నాతో అన్నాడు. అయితే.. ఒక తండ్రిగా నేను బాధపడ్డాను. అతడి వయసు 23 ఏళ్లే. నేను ట్రోల్స్ గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రతి ఒక్కరి నోరు మూయించలేం. ఫ్యాన్స్ లేకుండా గేమ్ లేదు. ఒక్క నష్టంతో ఇతరులు జీర్ణించుకోలేకపోయినా.. నీ పక్షాన కొందరు ఉంటారు. ఆటలో చివరికి ఒక జట్టే విజేతగా నిలవగలదు" అని అర్ష్‌దీప్ తండ్రి దర్శన్ వివరించారు. తల్లి బల్జీత్ మాట్లాడుతూ "భారత జట్టు మొత్తం తనకు మద్దతుగా నిలిచిందని అర్ష్ నాతో చెప్పాడు" అని పేర్కొన్నారు.