ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఐసీసీ హెచ్చరించింది. మ్యాచ్ ఆడుతుండగా అతడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
ఇదీ జరిగింది.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఫించ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కామెరున్ గ్రీన్ వేసిన బంతిని బట్లర్ ఇన్‌సైడ్ ఎడ్జ్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది.
ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ ఫించ్ అంపైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఈ నేపథ్యంలోనే ఫించ్‌ను ఐసీసీ హెచ్చరించింది. మరోసారి ఇదే రిపీట్ చేస్తే మ్యాచ్ నిషేధంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఐసీసీ హెచ్చరిక కారణంగా డీమెరిట్ కింద ఫించ్‌కు ఒక పాయింట్ కోత పడింది.
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (68) అలెక్స్ హేల్స్ (51) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44), మిచెల్ మార్ష్ (26),స్టోయినిస్ (15).. ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఇదీ చూడండి: ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమరానికి సై.. అమెరికాతో భారత్ ఢీ