Amrapali projects Dhoni: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదంపై సుప్రీం తలుపుతట్టాడు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని ధోనీ తరఫున హాజరైన న్యాయవాది ఉద్ధవ్ నందా సుప్రీంను కోరారు. తమకు మార్గదర్శనం చేయాలని అభ్యర్థించాడు. అయితే, ఏ రకమైన మధ్యవర్తిత్వ ప్రక్రియ అనే విషయాన్ని నందా తెలియజేయలేదు. ఈ వ్యాజ్యాన్ని మే 9న విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది.
Dhoni moves SC: 2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా నియమించుకుంది ఆమ్రపాలి సంస్థ. పలు వ్యాపార విషయాల్లోనూ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ధోనీకి చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ అతడికి యాజమాన్య హక్కులు కల్పించలేదు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోని బాధ్యతలను అర్ధంతరంగా నిలిపివేసింది. మహీ భార్య సాక్షి కూడా ఈ సంస్థకు సంబంధించిన ఓ ఛారిటీ సంస్థతో వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.
కాగా, ఆమ్రపాలి వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం ఏడు బ్యాంకులు రూ.280 కోట్లను విడుదల చేశాయని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. వీటిని ఇతర పనుల కోసం వినియోగించకూడదని ఏడు బ్యాంకుల తరఫున హాజరైన న్యాయవాది సుప్రీంను కోరారు. దీనికి ధర్మాసనం అంగీకారం తెలిపింది.