ప్రధాన ఓపెనింగ్ జోడీ రోహిత్, రాహుల్, పూర్తి స్థాయి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండానే న్యూజిలాండ్‌తో తొలిటెస్టుకు(IND vs NZ 1st Test) భారత్‌కు సన్నద్ధమవుతోంది. రోహిత్‌కు విశ్రాంతినివ్వగా, రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోహ్లీ కూడా తొలి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుంటుండగా, కీపర్ రిషబ్ పంత్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు కూడా కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా పెద్దగా ఫామ్‌లో లేని అజింక్యా రహానే కాన్పూర్ టెస్టులో భారత జట్టును నడిపించనున్నాడు. కేవలం నెలలో వ్యవధిలోనే భారత జట్టు దక్షిణాకాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో యువజట్టు కూర్పుపై కోచ్ ద్రవిడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.
IND vs NZ Test Match Prediction: స్టార్ క్రికెటర్లు రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ, పంత్ లేకపోవడం వల్ల జట్టు రిజర్వు బలాన్ని పరీక్షించేందుకు కోచ్ ద్రవిడ్‌కు మంచి అవకాశం లభించినట్లే. ప్రస్తుత జట్టులో రహానే, పుజారా, మయాంక్ అగర్వాల్ మాత్రమే పది టెస్టులకంటే ఎక్కువ ఆడారు. మయాంక్, శుభ్‌మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. వారు మంచి ప్రదర్శన చేస్తే రెగ్యులర్ ఓపెనర్లు జట్టులోకి వచ్చినప్పుడు అవసరమైతే వారిని మిడిల్ ఆర్డర్‌లోనైనా సర్ధుబాటు చేసే అవకాశం ఉంటుందని కోచ్ ద్రవిడ్ ఆశిస్తున్నాడు. గత 11 టెస్టుల్లో కేవలం 19 సగటుతో మాత్రమే పరుగులు చేసిన రహానే జట్టులో కొనసాగాలంటే కెప్టెన్‌గానే కాకుండా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్‌ల బౌలింగ్ దాడిని ఎదుర్కొని నిలిస్తేనే రహానే భారీ స్కోరు సాధించే అవకాశముంది. భయం లేకుండా ఆడతానని చెబుతున్న పుజారా భుజస్కంధాలపైనే జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టే బాధ్యత పడనుంది. ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయబోతున్న శ్రేయుస్ అయ్యర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓపెనర్లుగా గిల్, మయాంక్, తర్వాత పుజారా, రహానే బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే అవకాశం ఉంది.