ajinkya rahane performance: అజింక్య రహానె.. భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీకి సహాయకుడిగా (వైస్ కెప్టెన్‌గా) ఉండే మిడిలార్డర్ బ్యాటర్. ఎంత ఒత్తిడినైనా తనలో కనిపించనీయకుండా కోహ్లీ గైర్హాజరీలో ప్రశాంతంగా జట్టును నడిపించే కెప్టెన్.. సారథిగా టీమ్ గెలుపోటముల సంగతిపక్కనపెడితే.. ఆటగాడిగా విఫలమవుతున్న అజింక్య రహానెకు యువ క్రికెటర్ల నుంచి పోటీ తప్పేలా లేదు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ తానేంటో నిరూపించుకోగా.. సూర్యకుమార్ యాదవ్ వేచి చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోలేదనే అపవాదు రహానెపై ఉంది. ఈ క్రమంలో రహానె గత రెండేళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?
పుజారాతోపాటు అజింక్య రహానె క్రీజ్‌లో ఉన్నాడంటే అభిమానులకు అదొక భరోసా. ఎంతటి భీకరమైన బౌలింగ్‌నైనా కాచుకుంటారులే అనే ధీమా. సీజన్ సీజన్‌కు తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటూ జట్టుకు ఉప నాయకుడిగా ఎదిగిన అజింక్య రహానె అప్పుడప్పుడు సారథిగానూ టీమ్‌ఇండియాను నడిపించాడు. అయితే ఆటగాడిగా మాత్రం గత రెండేళ్ల నుంచి మాత్రం రాణించలేకపోతున్నాడు. దానికి అజింక్య గణాంకాలే సాక్ష్యం.. 2013లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన రహానె తన కెరీర్‌లో ఇప్పటి వరకు 80 టెస్టులు ఆడాడు. అయితే 39.27 సగటుతో 4,830 పరుగులు సాధించాడు. వీటిలో పన్నెండు శతకాలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట వరకు అద్భుతంగా ఆడిన రహానె.. 2020, 2021 ఏడాదిలో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. గతేడాది ఆసీస్‌పై సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు లేకపోవడం గమనార్హం. గత సంవత్సరంలో(2020) నాలుగు టెస్టులు ఆడిన రహానె 38.86 సగటుతో 272 పరుగులు చేశాడు. అందులో ఒకే ఒక్క శతకం మాత్రమే ఉంది. అత్యధిక స్కోరు 112 పరుగులు. ఈ ఏడాది కూడానూ పెద్దగా రాణించిదేమీ లేదు. 2021లో ఇప్పటివరకు 13 టెస్టులు ఆడిన అజింక్య 19.57 సగటుతో కేవలం 450 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండే అర్ధశతకాలు ఉండటం గమనార్హం.