"ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో(Mushtaq Ali Trophy 2021) 38 జట్లు కలిసి 105 మ్యాచ్‌లు ఆడనున్నాయి. జట్ల లక్ష్యం ట్రోఫీ అందుకోవడమే. వ్యక్తిగతంగా ఆటగాళ్లకు మాత్రం ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ఆకట్టుకోవడమే ప్రథమ లక్ష్యం" అని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gambhir News) అభిప్రాయపడ్డాడు.
"రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో చేరిన నేపథ్యంలో ఈసారి వేలం భారీ స్థాయిలో జరగనుంది. దేశవాళీ నైపుణ్యం పరిశీలించేందుకు ఫ్రాంఛైజీలన్నీ తమ బృందాలను వివిధ వేదికలను కచ్చితంగా పంపిస్తాయి. వచ్చే 2-3 నెలలు కుర్రాళ్లకు కీలకం. చక్కటి ప్రదర్శనకు తోడు అదృష్టం కలిసొస్తే వాళ్లు రాత్రికి రాత్రి కోటీశ్వరులవుతారు."
-గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్.
అయితే.. కొందరు సీనియర్లు జూనియర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని గంభీర్ పేర్కొన్నాడు. "సెలక్టర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్న ఓ క్రికెటర్ ప్రస్తుతం రంజీని వదిలేసి పూర్తిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే దృష్టి సారించాడు. అతడు నాతో కలిసి టీమ్‌ఇండియాకు ఆడాడు కూడా. అప్పుడు పూర్తి అంకితభావంతో ఆడాడు. ఇప్పుడు మాత్రం ఫ్రాంఛైజీ క్రికెట్లోనే డబ్బుందని భావిస్తున్నాడు. యువ క్రికెటర్లకూ అదే హితబోధ చేస్తుండటమే ఆందోళన కలిగిస్తోంది" అని గంభీర్ అన్నాడు. దీనికి సరైన పరిష్కారాన్ని బోర్డు కనుగొనాలని, ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడేలా చేయాలని తెలిపాడు.